నారాయణ కాలేజీలో.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!

విధాత: హైదరాబాద్ సమీపంలోని ఘట్ కేసర్ నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. నారాయణ కాలేజీలో చదువుతున్న జశ్వంత్ రెడ్డి అనే విద్యార్థి ఇటీవల జరిగిన పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అదే సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి అతన్ని పిలిచి తీవ్రంగా మందలించాడు. దీంతో మనస్తపానికి గురైన జశ్వంత్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జశ్వంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
జశ్వంత్ తన సూసైడ్ నోట్ లో తనను ప్రిన్సిపాల్ అవమానించినట్లు పేర్కొన్నాడు. ఒక పేపర్ జీవితాన్ని డిసైడ్ చేయదని నోట్ లో రాసిన తను ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేసింది. జశ్వంత్ సూసైడ్ నోట్‌ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్పోరేట్ కళాశాలల్లో విద్యార్థుల బలవన్మరణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.