తెలంగాణ రోడ్లపై నెత్తుటేర్లు.. రోజుకు 20 మరణాలు
ఏటికేడాది తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. సగటున రోజుకు ఇరవై మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో రోడ్లపై ప్రయాణించడం అంటే భయపడే పరిస్థితి ఎదురవుతున్నది. ఏ రోజు పేపర్ చూసినా, టీవీ చానళ్లు చూసినా రోడు ప్రమాద వార్త ప్రత్యేకించి గత రెండేళ్లుగా ప్రమాదాలు 20 శాతం పెరిగినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. వీటితోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. 2023లో మొత్తం సుమారు 22,900 ప్రమాదాలు చోటు చేసుకుంటే.. 2025లో వాటి సంఖ్య ఏకంగా సుమారు 27300కు చేరుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేకించి 2020 నుంచి ఈ పెరుగుదల కనిపిస్తున్నది. 2020లో 19,172 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో 2,325 తీవ్రంగా గాయపడగా.. 6,882 మంది చనిపోయారు. 2025 నాటికి ప్రమాదాల సంఖ్య 27,352కి పెరగగా.. తీవ్రంగా గాయపడినవారి సంఖ్య 1,528గా ఉంటే.. 7,545 మంది చనిపోయారు.

చిన్న ప్రమాదం చోటు చేసుకున్నా రిపోర్ట్ అవుతున్నదని, వాటిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం పెరిగిన నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య అధికంగా కనిపిస్తున్నదని ఆర్టీవో అధికారులు చెబుతున్నారు. మితిమీరిన వేగం, రాగ్ రూట్‌లో వాహనం నడిపించడం, హెల్మెట్లు ధరించకపోవడం, మద్యం తాగి వాహనం నడపడం.. ఈ నాలుగు ప్రధాన కారణాల వల్లే రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ కారణాలతో 2025లో ఇప్పటి వరకూ 7500 మంది చనిపోయారని, అంటే సగటున రోజుకు 20 మంది మరణిస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాద మరణాలు ఇతర జిల్లాలతో పోల్చితే తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మరణాలు ఉంటున్నాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. వరంగల్‌ను కూడా కలుపుకొంటే ఈ మూడు ప్రాంతాల్లో మొత్తం మరణాల్లో 28 శాతం ఉన్నాయి. సైబరాబాద్ పరిధిలో మరణాలు అధికంగా ఉండటానికి ఇక్కడ ఉన్న ఓఆర్‌ఆర్, ఇతర హైవేవే నెట్‌వర్క్ ఒక కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యం ప్రధాన కారణాలని అంటున్నారు.
మరో ప్రధాన కారణం.. డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడటం, అలసట, సీట్ బెల్ట్‌లు పెట్టుకోవడం, హెల్మెంట్ ధరించడం వంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడమని చెబుతున్నారు. హైదరాబాద్‌లో వాహనాలు ఢీకొనడంతో చోటు చేసుకునే మరణాలతోపాటే పాదచారుల మరణాలు కూడా అధిక సంఖ్యలో ఉంటున్నాయని సైబరాబాద్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ప్రత్యేకించి మూసాపేట నుంచి పటాన్‌చెరు వరకు ఉన్న భాగంలో పాదచారుల మరణాలు అధికంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. రోజంతా రోడ్లన్నీ భారీ ట్రాఫిక్‌తో ఇరుకుగా మారుతున్నాయని, రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత మాత్రమే కొంత ట్రాఫిక్ తగ్గుతున్నదని ఆయన అన్నారు.
మితిమీరిన వేగమే 70 శాతం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నదని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. మానవ తప్పిదాలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయని అంటున్నారు. వేగాన్ని గుర్తించే స్పీ్‌డ్ కెమెరాలపై ఆధారపడటం కాకుండా.. రోడ్డు మార్కింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడం, సైన్‌బోర్డులు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయడం, వేగంపై, ప్రత్యేకించి మూల మలుపుల వద్ద నియంత్రణ విధించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైవేలు, ఓఆర్‌ఆర్‌పై ఓవర్‌టేకింగ్.. ప్రమాదాలను పెంచుతున్నదని చెబుతున్నారు. డ్రైవర్లు అలసిపోవడం, అకస్మాత్తుగా టైర్లు పేలిపోవడం ప్రమాదాన్ని పెంచుతున్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో 1535 బ్లాక్‌స్పాట్స్
తెలంగాణలోని నేషనల్ హైవేలపై 1535 బ్లాక్‌స్పాట్స్ ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 1259 బ్లాక్‌స్పాట్స్‌ను సరిచేశామని రోడ్డు రవాణా, హైవేల శాఖ పేర్కొన్నది. మిగిలిన బ్లాక్‌స్పాట్స్‌ను కూడా సరిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజ్యసభకు తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram