Ayodhya | శ్రీరామ నవమి వేళ అద్భుతం.. అయోధ్య బాలరాముడికి సూర్యతిలకం!

విధాత : శ్రీరామ నవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం ముస్తాబైంది. నూతన భవ్య రామమందిరం ప్రారంభోత్సవ తర్వాతా రెండో ఏడాది వచ్చిన శ్రీరామ నవమి వేడుకలకు శ్రీరామ మందిర్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లతో సన్నద్ధమైంది. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు తిలకం మాదిరిగా ప్రసరించనున్నాయి. ఈ అద్వితీయ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా రేపు మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది. నూతన గర్భాలయంలో కొలువైన బాల రాముడికి రేపు ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. బాల రామయ్య పుట్టిన రోజుకి 56 రకాల నైవేద్యాలను సమర్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు.
బాలరాముడి నుదుటిపై ‘సూర్య తిలకం’
బాలరామయ్యకు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్ధుతారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.
ఆలయం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది. మూడున్నర నిమిషాల పాటు కనిపించే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీ మీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఇందులో రెండు నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది.
నవమి రోజు ఉదయం బాలరాముడికి 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. శ్రీరామ నవమి వేడుకలకు వచ్చ భక్తుల రద్ధీకి అనుగుణంగా ప్రభుత్వం, ట్రస్టు అవసరమైన ఏర్పాట్లు చేసింది.