CM Revanth Reddy | రాబోయే రోజులపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

మంత్రి పదవుల కోసం గాంధీభవన్ లో ధర్నాలు చేయించడం ఏంటని? సీఎం రేవంత్‌రెడి అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్ లో ఇంకోసారి ధర్నాలు చేయవద్దని..ఏదయినా ఉంటే మా దృష్టికి తీసుకరావాలని..అంతే కానీ గొడవలు ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు.

  • By: TAAZ    news    Jun 24, 2025 6:34 PM IST
CM Revanth Reddy | రాబోయే రోజులపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy | స్థానిక సంస్థల ఎన్నికలలో విజయంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా పార్టీ..ప్రభుత్వం జోడెద్దులుగా సాగాలని పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ రెండో సారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉందని.. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని..ఈ పదేళ్లు నా బాధ్యత..ఆ తర్వాత ఆ బాధ్యత మీరు తీసుకోవాలన్నారు. గాంధీభవన్‌కు మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ, అడ్వైజరీ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులకు భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్‌ పీరియడ్‌ అని..18 నెలల్లో మన ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా నాయకులు ఉండాలని..10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు..18 నెలల కాంగ్రెస్ పాలనపైన బహిరంగ చర్చకు సవాల్ చేయాలని సూచించారు. అధికారం వచ్చిన 18 నెలల్లో దేశంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని..60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు,40 శాతం డైట్ చార్జీలు పెంచామని గుర్తు చేశారు. 100 ఏళ్ల కులగణన కలను నెరవేర్చామని..కులగణన చేసి ప్రధాని మోదీ ప్రభుత్వానికి సవాల్ విసిరాం..కేంద్రం మెడలు వంచి దేశంలో కులగణన చేపట్టేలా చేశామన్నారు. 35 ఏళ్ళ నుంచి సాగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించామని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చామన్నారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామన్నారు. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌, జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నట్లు చెప్పారు. నేను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని..అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని వాటిని ప్రజల్లోకి పార్టీ నాయకత్వం, కేడర్ తీసుకెళ్లాలన్నారు.

పార్టీ సంస్థాగత నిర్మాణంపై పీసీసీ ఫోకస్

పార్టీ సంస్థాగత నిర్మాణంపైన పీసీసీ దృష్టి సారించాలని.బూత్‌, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని..ఇందుకు పార్టీ నేతలు ఐక్యంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పనిచేస్తేనే పదవులు వస్తాయని..పార్టీ కమిటీ నాయకులు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని..పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి పదవులు ఇచ్చామన్నారు. లక్ష్యాలు నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలని సూచించారు. పీసీసీ కమిటీల్లో పనిచేయని వారి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలని..పనిచేసే వారికి ప్రమోషన్..చేయని వారిని డీమోషన్ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ పదవి అని చిన్న చూపు చూడొద్దు..రేపు గొప్ప అవకాశాలు ఇచ్చేది పార్టీ పదవులేనన్నారు. 2029 లో పార్టీ 2 వ సారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే వస్తాయన్నారు.

మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి

మార్కెట్ కమిటీ లు,టెంపుల్ కమిటీ లు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇంచార్జి మంత్రులదేనని.. నిధులు..బాధ్యతలు అన్నీ మీదగ్గరే ఉన్నాయని..జిల్లాల ఇంచార్జి మంత్రులు ప్రభుత్వ లక్ష్యాలపైన దృష్టిపెట్టడం లేదని..ఇది సరైంది కాదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని..వెంటనే జిల్లాల్లో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయని..స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలన్నారు.

గాంధీభవన్ ధర్నాలపై సీరియస్

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీ ని సిద్ధం చేయాలని..అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. ఎవరికి వారు..నేనే అభ్యర్థి అని చెప్పుకోవద్దని..పార్టీ క్రమశిక్షణారాహిత్యంగా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. మంత్రి పదవుల కోసం గాంధీభవన్ లో ధర్నాలు చేయించడం ఏంటని? సీఎం రేవంత్‌రెడి అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్ లో ఇంకోసారి ధర్నాలు చేయవద్దని..ఏదయినా ఉంటే మా దృష్టికి తీసుకరావాలని..అంతే కానీ గొడవలు ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్, నేను అందుబాటులోనే ఉంటున్నామని..మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని హామీ ఇచ్చారు.