CWC | ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఉగ్ర దాడి

  • By: sr    news    Apr 24, 2025 5:30 PM IST
CWC | ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఉగ్ర దాడి

విధాత: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) తీర్మానం చేసింది. గురువారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సోనియగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో సీడబ్ల్యూసీ కొన్ని తీర్మానాలకు ఆమోదం తెలిపింది. పహిల్గామ్ దాడి పాకిస్తాన్ మద్దతుతో సుదీర్ఘంగా పన్నిన కుట్రగా అభివర్ణించింది. ఇది భారత ప్రజాస్వామ్య విలువలపై నేరుగా దాడి అని పేర్కొంది. హిందువులను లక్ష్యంగా చేసి దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు జరిగిన కుట్రగా పేర్కొంది. దాడికి ప్రతిగా ఉద్రిక్తతలు రాకుండా ఉండేందుకు ప్రజలను శాంతి పాటించమని కోరింది.

ఉగ్ర దాడిపై ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ కోరింది. కేంద్ర హోంశాఖ నేరుగా పర్యవేక్షించే కేంద్ర పాలిత ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం చూస్తే భద్రతా లోపం వల్లే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. దీనిపై లోతైన విచారణ జరగాలని డిమాండ్ చేసింది. రాబోయే అమర్‌నాథ్ యాత్రలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రతా ఏర్పాట్లు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని కోరింది. టూరిజంపై ఆధారపడి జీవించే స్థానిక ప్రజల జీవనోపాధిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బీజేపీ సోషల్ మీడియా విభజన రాజకీయాల కోసం పహిల్గామ్ దాడిని వినియోగిస్తోందని, ఐక్యత అవసరమైన సమయంలో ఇలాంటి పనులు దురదృష్టకరమని విమర్శించింది.

సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సంతాపం ప్రకటించారు. ఉగ్రదాడి ఘటనపై చర్చించి సంతాపం తెలిపేందుకు కమాండ్ కంట్రోల్ భవనంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణ రావు, దామోదర్ రాజా నర్సింహ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సహా వారంతా పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరులను సేఫ్‌గా తీసుకురావడంపై అధికారులతో చర్చించారు. ఉగ్రదాడికి నిరసనగా సాయంత్రం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు.