TTD: తిరుమల.. జూన్ నెల కోటా టికెట్ల విడుదల

  • By: sr    news    Mar 18, 2025 1:51 PM IST
TTD: తిరుమల.. జూన్ నెల కోటా టికెట్ల విడుదల

విధాత‌: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. జూన్ నెల కోట శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన సేవల టికెట్లను మార్చి 18న ఆన్‌లైన్‌ విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. లక్కీ డిప్‌ రిజిస్ట్రేషన్‌ ఈ నెల 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుందని.. ఆ లోగా భక్తులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. లక్కీ డీప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20 నుంచి 22 వరకు మధ్యాహ్నం 12గంటల్లోగా డబ్బులు చెల్లిస్తేనే టికెట్లు కేటాయిస్తామని టీటీడీ చెప్పింది.

ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. జూన్‌ 9 నుంచి 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను అదే రోజు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్స్‌కు సంబంధించిన జూన్‌ నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం కోటాను రిలీజ్‌ చేయనున్నట్లు పేర్కొంది. శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్‌లైన్ కోటాను 22న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది.

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్‌ కోటా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు పేర్కొంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. తిరుమల, తిరుపతిల‌లో వసతి గదుల కోటాను జూన్ నెల మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు చెప్పింది. భక్తులందరూ ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్‌ చేసుకొని సహకరించాలని కోరింది.