UAE, Iran | త్వరలో యుద్ధంలోకి ఎమిరేట్స్? భారతదేశంపైనా ప్రభావం!
మధ్య ఆసియా యుద్ధంలో ఇజ్రాయెల్‌ను మినహాయిస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పైనే ఇరాన్ తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నది. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నప్పటికీ.. తమ సహనం నశిస్తున్నదనే సంకేతాలను యూఏఈ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ సైతం యుద్ధంలోకి దిగుతుందా? అనే చర్చలు మొదలయ్యాయి. అదే జరిగితే భారత్‌పైనా ప్రభావం ఉంటుందని అంటున్నారు.
UAE, Iran | మధ్య ఆసియా యుద్ధంలో ఈ నెల రోజుల్లో దాదాపు 11 దేశాలు ఇరాన్ దాడులకు గురయ్యాయి. ఈ యుద్దంలో ఇజ్రాయెల్‌ను మినహాయిస్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్ప మరే దేశంపైనా అంత తీవ్ర స్థాయిలో దాడులు లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ సహనం నశిస్తున్నదంటూ యూఏఈ సంకేతాలు పంపుతున్నది. మరి పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగి అమెరికా, ఇజ్రాయెల్‌తో ఎమిరేట్స్ చేతులు కలుపుతుందా? ఇప్పుడు ఇదే అంశంలో చర్చలు జరుగుతున్నాయి.
గత మూడు వారాల వ్యవధిలో యూఏఈపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. సుమారు 2200కుపైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే.. వాటిలో 95 శాతానికిపైగా యూఏఈ తన గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా అడ్డుకుంది. అయితే.. నిరంతర దాడులతో యూఏఈ సహనం కోల్పోతున్నదన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్నాయి.
హార్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో భూతల దాడులకు సైతం అమెరికా దిగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఆ దాడులకు యూఏఈ వేదిక అవుతుందని అంటున్నారు. ఇరాన్ వర్గాలు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ప్రపంచ ఇంధన సరఫరాలో సుమారు 20 శాతం హార్ముజ్ జల సంధి ద్వారానే రవాణా అవుతుందని అంచనా. ఈ మార్గం ఇరాన్ నియంత్రణలో ఉన్నది. తాజా ఉద్రిక్తతలకు కొత్త కారణాలే కాదు.. పాత వివాదాలు కూడా ఉన్నాయి. అబూ ముసా, టున్బ్ దీవులు 1971 నుంచి ఇరాన్ ఆధీనంలో ఉన్నాయి. దీనిపైనా యూఏఈతో వివాదం ఉంది. ఈ అంశం రెండు దేశాల మధ్య విభేదాలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఇరాన్ హెచ్చరికలు
ఎమిరేట్స్‌లోని కీలక ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటామని, అవసరమైతే ప్రతిదాడులు తప్పవని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. డిసాలినేషన్ ప్లాంట్లు, అణు విద్యుత్ కేంద్రాలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు తమ లక్ష్యంగా ఉంటాయని పేర్కొంది. 2020లో అబ్రహం అకార్డ్స్ తర్వాత యూఏఈ, ఇజ్రాయెల్ సంబంధాలు బలపడ్డాయి. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో రెండు దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకుంటున్నాయి. ఇది ఇరాన్ ఆందోళనకు ఒక కారణంగా చెబుతున్నారు.
భారతదేశంపై ప్రభావం?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుద్ధంలో దిగితే.. అది భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎమిరేట్స్‌లో సుమారు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా. వీరి భద్రత ప్రశ్నార్థకమవుతుంది. రెండు దేశాలు యుద్ధంలో ఉంటే.. ఇంధన సరఫరాలకు ఆటంక కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడారు. యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఎమిరేట్స్ సైతం యుద్ధంలోకి దిగితే.. పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. ఇది గ్లోబల్ ఎనర్జీ, భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram