Operation Sindoor | ఆపరేషన్‌ సిందూర్‌పై సంచలన విషయం బయటపెట్టిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. పార్లమెంట్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్‌, టీఆర్ బాలు, ఎంఐఎం ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.

  • By: TAAZ |    news |    Published on : May 08, 2025 5:28 PM IST
Operation Sindoor | ఆపరేషన్‌ సిందూర్‌పై సంచలన విషయం బయటపెట్టిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Operation Sindoor | : ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ ఆపరేషన్‌ ఒక్క రోజుతో ముగియలేదుని, కొనసాగుతున్నదని తెలిపారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు అపరేషన్ సిందూర్, దాని అనంతర పరిణామాలను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన తీరు.. అనంతర పరిణమాలను అఖిల పక్ష పార్టీలకు వివరించారు. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన సందేశాన్ని సమావేశంలో చదివి వినిపించారు. ఆపరేషన్ సిందూర్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నందున సాంకేతిక పరమైన సమాచారం వెల్లడించలేమని తెలిపారు. పాకిస్తాన్ ప్రతిదాడుల అంచనా నేపథ్యంలో తీసుకున్న రక్షణ చర్యలను తెలియచేశారు. పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్రమైన ప్రతిదాడి ఉంటుందని రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై ప్రతిపక్షాలు పలు సూచనలు చేశాయి.

అపరేషన్‌ సిందూర్‌కు అన్ని పార్టీల మద్దతు

అఖిలపక్ష భేటీ అనంతరం సమావేశం వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మీడియాకు వివరించారు. ఆపరేషన్ సిందూర్ ను అన్ని పార్టీలు సమర్ధించాయని..కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని సంచలన అంశాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నందునా పూర్తి వివరాలు ఇవ్వలేమని తెలియచేశామని వివరించారు. అఖిలపక్షం నేతలు త్రివిధ దళాలను అభినందించినట్లుగా తెలిపారు. పాకిస్తాన్ ఆపరేషన్ సిందూర్ పై తప్పుడు ప్రచారం చేస్తుందని..అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరడం జరిగిందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పామన్నారు. భద్రతాపరమైన కొన్ని విషయాలు చెప్పలేమని కేంద్రం తెలిపిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ అఖిలపక్ష భేటీలో మేం కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ ను అభినందించారు. పూంచ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఉగ్రవాద బాధితులుగా ప్రకటించి సహాయం చేయాలని కోరినట్లుగా తెలిపారు. అలాగే అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు బటిండాలో రాఫెల్ కూలిపోయిందని నివేదించాయని..ఇది మన సాయుధ దళాల నైతికతను దెబ్బతీయకుండా ఉండేందుకు భారత వైమానిక దళం ఆ ప్రచారాన్ని ఖండించాలని కోరారు.