Kishan Reddy : బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన
బీహార్‌లో ఎన్డీఏ విజయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, ప్రజలు 'జంగిల్ రాజ్' వద్దనుకుని, మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. జూబ్లీహిల్స్ ఓటమిపై మాట్లాడుతూ, అక్కడ బీజేపీ ఎప్పుడూ గెలవలేదని, అయితే డబ్బులు, ఎంఐఎం అండతోనే కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు.
విధాత, హైదరాబాద్ : బీహార్ లో ఎన్డీఏవిజయంతో ప్రజలు జంగిల్ రాజ్ మళ్లీ రావొద్దని కోరుకున్నారని, ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీహార్ ప్రజలు రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని వద్దనుకుని అభివృద్ధిని.. కోరుకున్నారని, నరేంద్రమోదీ నాయకత్వంలో.. నితీశ్ కుమార్నేతృత్వంలోని ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పురోగతి ఇకపైనా కొనసాగించాలని నిశ్చయించుకున్నారన్నారు.అందుకే ఎన్డీఏకు బంపర్ మెజారిటీ ఇచ్చారు. సర్వే సంస్థలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ స్థాయిలో సీట్లు గెలుస్తుందని ఊహించలేదని చెప్పారు.
మోదీ నాయత్వంలో దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ముందుకెళ్తోంది. దీని ఫలితమే.. బిహార్ ఎన్నికల ఫలితాలు అని తెలిపారు. హర్యాన, మహారాష్ట్ర, ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రజలు మంగళం పాడేశారని నిరూపితమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఇప్పుడున్న 3 రాష్ట్రాలు కూడా.. చేజారిపోవడం ఖాయం అని తెలిపారు.
రాహుల్ ఆరోపణలు సరికాదని తేలిపోయింది
ఎన్నికల కమిషన్ ను విమర్శిస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అక్రమంగా ఉన్న ఓట్లను తొలగించడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ ఈ పద్దతే సరైనదని ప్రజలు అంగీకరించారు. ఎస్ఐఆర్ ను మోదీ చేయరు.. ఆయా జిల్లాల కలెక్టర్లు, తర్వాత క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియలో భాగస్వాములవుతారు. దీనికి మోదీకి సంబంధేమేంటి? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి చాలా విషయాలు తెలియక అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల అధికారులకు, దేశ ప్రజలకు ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలన్నారు.
జూబ్లీహిల్స్ లో మేం ఏనాడు గెలవలేదు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేం ఏనాడూ గెలవలేదు అని, కార్పొరేటర్ ఎన్నికల్లోనూ మేం ఈ ప్రాంతంలో గెలవలేదు. అయినా మేం ప్రయత్నం చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి.. బాధ్యత తీసుకుని ఎక్కువ కష్టపడ్డాం. రాజకీయ పార్టీగా మేం చేయాల్సిన పనిని చేశాం. ఫలితాన్ని మేం సమీక్షించుకుంటాం. అన్నారు. మరింత కష్టపడి పనిచేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే దిశగా పనిచేస్తాం అని చెప్పుకొచ్చారు.
డబ్బులు..ఎంఐఎం అండతో కాంగ్రెస్ గెలుపు
మజ్లిస్ అండతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందని, సహజంగా ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది సీఎం రేవంత్ పాలనకు రెఫరెండం కాదనే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పాను. బీజేపీ ఇండిపెండెంట్ గానే ఉంటుంది.. ఎవరితోనూ కలవదు. తప్పుడు ప్రచారం చేసి సాధించేది ఏమీ ఉండదు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కోట్ల కొద్ది రూపాయలను పంచాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. పోలింగ్ బూత్ ముందు.. ఎన్నికలకు ఒకరోజు ముందు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. దీనికి బాధ్యులెవరో తెలియదా. డబ్బులు పంపిణీ చేసినందుకే కాంగ్రెస్ గెలిచిందన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని, జూబ్లీ హిల్స్ ఓటర్లు ఓటేయాలని..డబ్బులిచ్చి. కాంగ్రెస్ గెలిచింది. ఈవీఎంలు బీహార్లో పనిచేయలేదా? లేక జూబ్లీహిల్స్ లో మాత్రమే సరిగ్గా పనిచేశాయా? అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలన్నారు.
తెలంగాణలో బీజేపీకి అనుకూల పవనాలు
బీజేపీకి రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో.. 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన మేం.. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి.. 8 ఎంపీ స్థానాల్లో గెలిచాం. మా విశ్లేషణ ప్రకారం.. పార్లమెంటు ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 57 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. మూడింట్లో రెండుచోట్ల గెలిచాం. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, టీచర్లు కలిసి మమ్మల్ని గెలిపించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింతగా విస్తరిస్తుందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram