Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల, యాదగిరిగుట్టలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాద్రి ఆలయాలు ఘనంగా ముస్తాబయ్యాయి. ఉత్తర ద్వార దర్శనానికి భారీ ఏర్పాట్లు చేశారు.

Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల, యాదగిరిగుట్టలు

విధాత : వైకుంఠ ఏకాదశికి తెలుగు రాష్ట్రాల ప్రముఖ దేవాలయాలు ముుస్తాబయ్యాయి. ఏపీలోని ప్రసిద్ద తిరుమల తిరుపతి, ఒంటిమిట్ట కోదండ రామాలయం, తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామి, మఠంపల్లి లక్ష్మినరసింహస్వామి, భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలు సహా ప్రసిద్ద దేవాలయాలన్ని భక్తులకు స్వామివారి వైకుంఠ(ఉత్తర) ద్వార దర్శనం కల్పించేందుకు భారీ ఏర్పాట్లతో సిద్దమయ్యాయి.

తిరుమల దేవస్థానంలో సోమవారం అర్ధరాత్రి దాటగానే సోమవారం అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. వైకుంఠద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టుకు పుష్ప సమర్పణ చేస్తారు. స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు ఏకాంత సేవలు నిర్వహించి..1:30గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శన వసతి కల్పించనున్నారు.

అయితే తొలుత వీఐపీలకు, అనంతరం మంగళవారం ఉదయం 6గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. భక్తుల సౌకర్యార్ధం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం జనవరి 8 రాత్రి 12గంటల వరకు కొనసాగించనుండటం గమనార్హం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.

ఫలపుష్పాలతో సుందర అలంకరణ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని సర్వాంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఫల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనున్న పది రోజుల పాటు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 లక్షల కట్‌ ఫ్లవర్స్‌తో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను అలంకరిస్తారు. అలాగే విద్యుత్‌ దీపకాంతులతో తిరుమల దేదీప్యమానంగా వెలుగులీననుంది. ప్రధాన ఆలయం వెలుపల శ్రీరంగనాథస్వామి ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. ఇందులో అష్టలక్ష్ములు, శ్రీవేంకటేశ్వరస్వామి నమూనాలను కొలువుదీర్చారు.

తిరుమల సందర్శనకు ఈ డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులకు గదుల కేటాయింపు చేపట్టారు. సీఆర్వో విచారణ కేంద్రంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. టైంస్లాట్‌ మేరకు తిరుమల శ్రీవారి సందర్శనకు వచ్చే భక్తులకు వేర్వేరుగా ప్రవేశ మార్గాలు నిర్ణయించారు. మొదటి మూడు రోజులు డిసెంబర్‌ 30, 31, జనవరి 1 తేదీల్లో టోకెన్లు ఉన్న భక్తులనే దర్శనానికి అనుమతించనున్నారు. మంగళవారం తెల్లవారుజామున 1గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైంస్లాట్‌ టోకెన్‌ పొందినవారిని కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్‌లో ఉన్నవారిని ఏటీజీహెచ్‌ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లూ లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. భక్తులు ఆధార్‌ కార్డుతో పాటు డిప్‌లో కేటాయించిన టోకెన్‌ ప్రింట్‌కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది.

ఇప్పటికే జారీచేసిన ఎస్‌ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానికులకు రోజుకు 5వేల మంది చొప్పున ఇప్పటికే ఈ-డిప్‌ ద్వారా టోకెన్లు జారీచేశారు.

యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు

యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయాన్ని, గోపురాలను పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున 2గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ, నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వార దర్శనం ప్రారంభిస్తారు. ఉదయం 5:30నుంచి 6:30నుంచి ఉత్తర ద్వార దర్శనం కొనసాగిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 30నుంచి జవవరి 4వరకు ఆరు రోజుల పాటు శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, జోడు సేవలను రద్దు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఏకాదశి డిసెంబర్ 30న లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజరూప దర్శనం, సహస్ర నామార్చన సేవలు కూడా ఉండవని తెలిపారు.

వైకుంఠ ద్వార దర్శనానికి భద్రాద్రి ముస్తాబు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకకు ముస్తాబైంది. మంగళవారం ఉదయం 5 గంటలకు గరుడ వాహనంపై స్వామి వారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి :

Silver, Gold Price| దిగొచ్చిన వెండి, బంగారం ధరలు
KCR| కేసీఆర్ సభకు వచ్చారు..వెళ్లారు!