Pm Modi: ఉగ్రవాదులను.. ఊహించని దెబ్బకొట్టాం

- ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్
- ఆ సంగతిని యావత్ ప్రపంచం చూసింది
- అణు బ్లాక్‌మెయిల్‌ను సహించేది లేదు పీవోకే అప్పగింత,
- ఉగ్రవాదంపైనే చర్చలు మరే విషయాలూ చర్చించేది ప్రసక్తి లేదు
- మన మహిళల సిందూరం తుడిచేస్తే జరిగేదేంటో టెర్రరిస్టులకు చూపాం
- దేశం ఐక్యంగా ఉంటే ఇలా ఉక్కు నిర్ణయాలు
- పాక్ దుస్సాహసాలను తిప్పికొడతాం
- వారి చర్యలను బట్టే మన చర్యలుంటాయి
- ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ : ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే చర్చిస్తామంటూ సహించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం, చర్చలు, ఉగ్రవాదం, వ్యాపారం ఏకకాలంలో సాధ్యం కాదని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ తొలిసారి సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్‌తో చర్చలు ఆక్రమిత కశ్మీర్ అప్పగింత, ఉగ్రవాదంపైనే ఉంటాయని, ఇంక వేరే అంశాలపై ఉండబోవని స్పష్టం చేశారు. ఎలాంటి అణు బ్లాక్‌మెయిల్‌ను భారతదేశం సహించబోని అన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భారత ఆర్మీ ఎంతో ధైర్యం ప్రదర్శించిందని మోదీ అన్నారు. మన సైన్యం తెగువకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. భారత శాస్త్రవేత్తలకు కూడా ఆయన సెల్యూట్ చేశారు. పహల్గామ్‌లో అమాయక పౌరులను ఉగ్రవాదులు బలిగొన్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో భారతదేశం తన వీరత్వాన్ని చాటిందని చెప్పారు.
‘మన మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దెబ్బ కొట్టాం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం’ అని ఆయన చెప్పారు. భారీ ఆర్మీ దాడుల్లో వంద మంది కరడుగట్టిన ఉగ్రవాదుల హతమయ్యారని అన్నారు. ఉగ్రవాదులపై దాడులు చేసే విషయంలో మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. మన దాడుల తీవ్రతను చూసి పాకిస్తాన్ కూడా నివ్వరపోయిందని చెప్పారు. భారతదేశ నిఘా, సాంకేతిక పరిజ్ఞానం ముందు పాకిస్తాన్ తేలిపోయిందన్నారు. టెర్రరిస్టులను నియంత్రించాల్సింది పోయి.. మనపై పాకిస్తాన్ ఎదురుదాడికి దిగిందని మోదీ విమర్శించారు. పాక్ దాడుల్లో మన విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, గురుద్వారాలు లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
కానీ.. మన సైన్యం పాకిస్తాన్ డ్రోన్లను, క్షిపణులను కూల్చివేసిందని చెప్పారు. పాక్ క్షిపణులు భారత్‌లోకి రానివ్వలేదని, పైగా పాక్ గుండెల్లో బాంబులు పేల్చామని అన్నారు. పాకిస్తాన్‌లోని ఎయిర్‌బేస్‌లను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసిందని చెప్పారు. ఈ దెబ్బకు పాక్ విలవిల్లాడిందన్నారు. భారతదేశాన్ని ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్.. ప్రపంచ దేశాల సహాయం కోరిందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా.. తిప్పికొడతామన్న మోదీ.. ఆ దేశం చర్యలను బట్టే మన దేశం చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. అణు బాంబుల పేరుతో బ్లాక్‌మెయిల్ సహించేది లేదని స్పష్టం చేశారు. అటువంటి బెదిరింపులతో ఆపరేట్ అయ్యే ఉగ్ర శిబిరాలపై నిర్ణయాత్మక చర్యలు ఉంటాయని తెలిపారు. మన త్రివిధ దళాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాయని చెప్పారు.
భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని అన్నారు. ఉగ్రవాద సంస్థలకు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి మధ్య ఎలాంటి భేదం లేదని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ వ్యవహారాన్ని ప్రపంచం స్పష్టంగా చూసిందన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ మిలిటరీ అధికారులు బహిరంగంగా మద్దతు పలుకుతూ వారి పక్కన నిలబడటాన్ని ప్రపంచం చూసిందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నదనేందుకు ఇది తిరుగులేని ఆధారమని అన్నారు. దేశం ఐక్యంగా ఉన్నప్పుడు, మొదటి ప్రాధాన్యం దేశమే అన్న స్ఫూర్తి నెలకొన్నప్పుడు ఇలా ఉక్కులాంటి నిర్ణయాలు, శక్తిమంతమైన ఫలితాలు వస్తాయని మోదీ చెప్పారు.
భారత మిస్సైళ్లు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను తాకినప్పుడు ఆ భవనాలు మాత్రమే కూలిపోలేదని, అక్కడ నిల్వ చేసిన ఆయుధాలు సైతం ధ్వంసమయ్యాయని మోదీ తెలిపారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది ఉగ్రవాదంపై చేసే కొత్త సాధారణ పోరాటమని మోదీ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ అనేది ఒక పేరు మాత్రమే కాదని, దేశ ప్రజల సెంటిమెంట్ వ్యక్తీకరణ అని అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్‌ను దేశంలోని ప్రతి తల్లికి, చెల్లికి, కూతురుకు అంకితం ఇస్తున్నానని చెప్పారు. గడిచిన కొద్ది రోజులుగా దేశ సహనాన్ని చూశామన్న మోదీ.. సాయుధ దళాలకు సలాం చేశారు. భారత్ మాతాకీ జై అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.