Hyderabad: టూరిజం ఎండీపై కేసు ఏమైంది? FIR అయినా అరెస్టు ఎందుకు చేయలే!

  • By: sr    news    Apr 18, 2025 5:59 AM IST
Hyderabad: టూరిజం ఎండీపై కేసు ఏమైంది? FIR అయినా అరెస్టు ఎందుకు చేయలే!
  • ఎఫ్ఐఆర్ నమోదైనా అరెస్టు లేదు!
  • బీఆరెస్‌ హయాంలో నియామకం
  • అర్హత లేకున్నా పదవి దక్కించుకున్న బోయినపల్లి మనోహర్‌రావు
  • అడ్డగోలుగా లీజు అగ్రిమెంట్లు
  • వాటితో సంస్థకు 15 కోట్ల నష్టం
  • నారాయణగూడ స్టేషన్‌లో కేసు
  • తప్పుడు సర్టిఫికెట్లపై మరో కేసు
  • లైంగికంగా వేధించారన్న మహిళ
  • అయినా బోయినపల్లిపై చర్యల్లేవు!
  • అరెస్టుకు మంత్రి జూపల్లి అడ్డు?

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 17 (విధాత‌) : తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ‌లో కోట్ల రూపాయ‌ల అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కేసులు న‌మోదు అయిన త‌రువాత త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో తీవ్ర నిర్ల్యక్ష్యం కనిపిస్తున్నది. స‌ద‌రు అధికారిపై కేసు న‌మోదు చేసిన త‌రువాత అరెస్టు చేయ‌క‌పోగా ఆ కేసును నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న అరెస్టు కాకుండా ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆపుతున్నారా అంటే అవున‌నే విధంగా ప‌ర్యాట‌క శాఖ‌ చ‌ర్య‌లు ఉన్నాయి.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హ‌యాంలో అక్ర‌మాలు, అవినీతి జ‌రిగాయంటూ ప‌లువురిపై కేసులు పెట్టి, విచార‌ణ‌కు ఆదేశాలు జారీచేసింది. అందులో తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఒక‌టి. సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ బోయినప‌ల్లి మ‌నోహ‌ర్ రావుపై నారాయ‌ణ‌గూడ పోలీసు స్టేష‌న్‌లో అసిస్టెంట్ జ‌న‌రల్ మేనేజ‌ర్ ఎన్‌ ర‌మేశ్‌ నాయ‌క్ గ‌తేడాది సెప్టెంబ‌ర్ నెల‌లో కేసు న‌మోదు చేశారు. దుర్గం చెరువు లీజులో అక్ర‌మాలు, అవినీతితో సంస్థ‌కు న‌ష్టం జ‌రిగిందంటూ ఎఫ్ఐఆర్ న‌మోదైనా ఇంతవ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు బోయిన‌ప‌ల్లి మ‌నోహ‌ర్ రావును ఎఫ్ఐఆర్‌లో మొద‌టి నిందితుడిగా చేర్చుతూ ఐపీసీ 409, 420, 465 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు అయ్యింది. దుర్గం చెరువు డెక్ ఏరియా కోసం 2018 జూన్‌లో టెండ‌ర్లు పిల‌వ‌గా, అత్య‌ధికంగా కోట్ చేసిన క‌మ‌ల్ హోటల్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ దక్కించుకున్నది.

కానీ 2019 ఫిబ్ర‌వ‌రి నెల‌లో క‌మ‌ల్ హోట‌ల్స్ స‌బ్సిడ‌రీ అంటూ ఏ ఏ అవోకేష‌న్ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ది. టెండ‌ర్‌లో పాల్గొన‌ని సంస్థ‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నార‌ని, నిబంధ‌న‌ల ప్ర‌కారం అగ్రిమెంట్ జ‌ర‌గక‌పోవ‌డం మూలంగా ప్ర‌భుత్వానికి ఆర్థికంగా భారీ న‌ష్టం జ‌రిగింద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌నపై నారాయ‌ణ‌గూడ పోలీసు స్టేష‌న్‌లో న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాల‌ని మ‌నోహ‌ర్ రావు హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే ఆయ‌న‌పై 409 కింద కేసు న‌మోదు అయింద‌న్న విషయాన్ని ప‌ర్యాట‌క సంస్థ త‌ర‌ఫున వాదించిన న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకువెళ్ల‌లేదు. అరెస్టు నుంచి మిన‌హాయింపునిస్తూ విచార‌ణ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కానీ ఇంత వ‌ర‌కు విచార‌ణ చేసి, నాంప‌ల్లి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖ‌లు చేయ‌లేదు.

లీజుతో 15 కోట్ల నష్టం

ఈ లీజు అగ్రిమెంట్ కార‌ణంగా ప‌ర్యాట‌క సంస్థ సుమారు రూ.15 కోట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయింది. వాస్త‌వానికి వేయి చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం ఇవ్వాల్సి ఉండ‌గా ప‌దిహేను వంద‌ల గ‌జాల స్థ‌లం లీజు అగ్రిమెంట్ దారుడికి అప్ప‌గించారు. 409 సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు అయి, విచార‌ణ‌లో నిజ‌మ‌ని తేలితే స‌ద‌రు అధికారిపై ప‌ది సంవ‌త్స‌రాల జైలు శిక్షతోపాటు జ‌రిమానా విధిస్తారు. అయితే ఈ మ‌ధ్య‌లోనే సంస్థ‌లోని కొంద‌రు అధికారుల సహ‌కారంతో లీజుకు సంబంధించిన టెండ‌ర్ డాక్యుమెంట్లు, లీజు అగ్రిమెంట్ కాపీలు మాయ‌మ‌య్యాయని చెబుతున్నారు.

ఫోర్జ‌రీ చేసిన డాక్యుమెంట్ల‌ను కూడా దొర‌క్కుండా చేశార‌ని ఉద్యోగులే అంటున్నారు. కోర్టుకు స‌రైన ప‌త్రాలు స‌మ‌ర్పించ‌క‌పోవ‌డం వెన‌కాల ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హ‌స్తం ఉంద‌ని సంస్థ ఉద్యోగులు బ‌హిరంగంగా చ‌ర్చించుకుంటున్నారు. త‌న కులం వ్య‌క్తి కావ‌డం తోనే కేసులో కాల‌యాప‌న జ‌రుగుతున్నదని, సంస్థ త‌ర‌ఫున కోర్టులో స‌రిగా వాదించ‌డం లేదని చెబుతున్నారు. ఇంత వ‌ర‌కు చార్జ్‌షీట్‌ వేయ‌లేదంటే ఏ స్థాయిలో ఒత్తిడి ఉందో ఊహించుకోవాల‌ని ఉద్యోగులు చెబుతున్నారు. వ‌చ్చే నెల‌లో మ‌నోహ‌ర్ రావు రిటైర్‌ అవుతున్నార‌ని, ఇక కేసు అట‌కెక్కిన‌ట్లేన‌ని విమ‌ర్శ‌లు విన్పిస్తున్నాయి.

హోదా లేకున్నా ఎండీ ప‌ద‌వి.. ఎన్నో వివాదాలు

వాస్త‌వానికి ప‌ర్యాట‌క సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులను నియ‌మిస్తారు. అఖిల భార‌త స్థాయి అధికారుల‌ను నియ‌మించ‌న‌ట్ల‌యితే స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్ట‌ర్‌ను నియమించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఆ స్థాయి లేని, డివిజినల్‌ మేనేజర్‌ అయిన బోయిన్‌ప‌ల్లి మ‌నోహ‌ర్ రావును మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. జూనియ‌ర్ అధికారిని నియ‌మించారంటూ అప్ప‌ట్లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. మాజీ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు కులం వ్య‌క్తి కావడమే అర్హ‌త అని ఉద్యోగులు అప్ప‌ట్లో చ‌ర్చించుకున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కోడ్ ఉండ‌గా, అప్ప‌టి ప‌ర్యాట‌క శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్‌తో క‌లిసి తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్లారు.

ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో రావ‌డం, ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డంతో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మ‌నోహ‌ర్ రావుపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. త‌ప్పుడు బీటెక్ డిగ్రీ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించి మ‌నోహ‌ర్ రావు ప‌దోన్న‌తులు పొందారంటూ కాంట్రాక్టు ఉద్యోగి ష‌రీఫ్ 2018లో నారాయ‌ణ‌గూడ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో ష‌రీఫ్ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ముంబై న‌గ‌రంలోని ఇన్‌స్టిట్యూష‌న్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి బీటెక్ డిగ్రీ ఫేక్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించార‌ని, వాస్త‌వానికి ఆయ‌న డిప్లొమా చ‌దివార‌ని త‌న ఫిర్యాదులో తెలిపారు. త‌ప్పుడు డిగ్రీతో ప‌ర్యాట‌క సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నార‌ని అందులో పేర్కొన్నారు.

కొసమెరుపు..

నాగార్జున సాగ‌ర్ విజ‌య విహార్ లో ప‌నిచేసే లంబాడా మ‌హిళ (జ‌న‌ర‌ల్ హెల్ప‌ర్‌) త‌న‌ను లైంగికంగా వేధించారంటూ నారాయ‌ణ‌గూడ పోలీసు స్టేష‌న్ లో 2018 ఆగ‌స్టులో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌ర‌పాల్సిందిగా నారాయ‌ణ‌గూడ పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది. దీంతో మ‌నోహ‌ర్ రావుపై ఎస్సీ/ఎస్టీ వేధింపుల కేసుతో పాటు లైంగికదాడికి యత్నం కేసులు న‌మోదు చేశారు.