Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా లీక్ .. ఆ ఆలయాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు?
Jyoti Malhotra |
పాకిస్థాన్ కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలతో పోలీసులు యూట్యూబ్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన పలు అంశాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ట్రావెల్ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా దేశంలోని పలు టూరిస్ట్ ప్రదేశాల మీద వీడియోలు చేశారు.
అయితే.. ఆమె మన దేశ సైనిక స్థావరాలకు సంబంధించిన సున్నితమైన అంశాలను పాకిస్థాన్ కు చేర వేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాక పహల్గాం ఘటన జరిగే ఒక రోజు ముందే ఆ ప్రాంతానికి వెళ్లినట్టు.. అక్కడి సమాచారాన్ని పాకిస్థాన్ కు చెందిన నిఘా వర్గాలకు చేరవేసినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా జ్యోతి మల్హోత్రా ఒక ఆలయం మీద డ్రోన్ ఎగరేసినట్టు పోలీసులు గుర్తించారు.
దీంతో పోలీసుల అదుపులో ఉన్న జ్యోతి మల్హోత్రాను ఈ విషయంపై అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. గత ఏడాది ఆమె ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు. విచారణలో ఎటువంటి నేరారోపణలు బయట పడలేదని.. అక్కడ ఆమె ఏ ప్రాంతాలకు వెళ్లింది? ఎక్కడ బస చేసింది ? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
మరో వైపు 2024లో పూరీకి చెందిన మరో యూట్యూబర్‌తో శ్రీక్షేత్రాన్ని సందర్శించిన జ్యోతి ఆలయంపై డ్రోన్‌ను ఎగర వేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీ క్షేత్రంపై ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను జ్యోతి పాకిస్థాన్ నిఘా అధికారులతో పంచుకున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన మరికొన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్ నిఘా అధికారి డానిష్ తో జ్యోతి మల్హోత్రా చేసిన వాట్సాప్ చాట్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram