Jyothi Malhotra | జ్యోతి మల్హోత్రా డైరీలో సీక్రెట్లు.. చాలా దాచేసిందిగా!

Jyothi Malhotra | పాకిస్తాన్‌కు రహస్య సమాచారం చేరవేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే.. అంతకు ముందే ఆమె డైరీలో రాసుకున్న పలు రహస్యాలు బయటకు రావడం సంచలనం రేపుతున్నది. 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్‌కు రెండుసార్లు వెళ్లొచ్చిన తర్వాతి నుంచి ఆ దేశానికి చెందిన న్యూఢిల్లీలోని అధికారులతో సంప్రదింపుల్లో ఉన్నది. ఇప్పుడు ఆమె సందర్శనలకు సంబంధించిన డైరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. పది రోజులపాటు పాకిస్తాన్‌లో తన సందర్శన విషయాలను ఆమె తన డైరీలో రాసుకుంది.
ఈ పర్యటన తనకు ఎలా అనిపించిందో రాసింది. అక్కడి ప్రజలను తనను ఎంత సాదరంగా ఆహ్వానించారో, తన సబ్‌స్క్రైబర్లు తనపట్ల ఎంత ప్రేమ, ఆప్యాయతలు కనబరిచిందీ ఆమె వివరంగా రాసుకుంది. తాను లాహోర్‌లో ఉన్నప్పుడు కొంత మంది తన సబ్‌స్క్రైబర్లు వచ్చి కలిసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. భారతదేశంతోపాటు, విదేశాల్లో పర్యటనలకు సంబంధించిన విషయాలతో ఆమె ట్రావల్ విత్ జో అనే పేరిట యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నది. లాహోర్‌ను అన్వేషించడానికి రెండు రోజులు సరిపోవని పేర్కొన్నది. భారతదేశ భక్తులు పాకిస్తాన్‌లోని గురుద్వారాలు, ఆలయాలను సందర్శించుకునేందుకు పాకిస్తాన్ మరిన్ని మార్గాలు తెరవాలని ఆమె ఒక విజ్ఞప్తిని కూడా చేసింది.