Operation Sindoor | అమెరికా ఆధిపత్యంలో ఏక ధృవ ప్రపంచం

Operation Sindoor | అమెరికా ఆధిపత్యంలో ఏక ధృవ ప్రపంచం

తాజా ఇండో పాక్ యుద్ధక్రీడలో కర్త, కర్మ, క్రియలపై ఓ విశ్లేషణ: పార్ట్‌ -3

Operation Sindoor | రెండవ ప్రపంచ యుద్ధ తదనంతర పరిస్థితుల్లో ఓ దశలో ‘ప్రచ్చన్న యుద్ధ ప్రపంచం’ (కోల్డ్ వార్ వరల్డ్) ఏర్పడింది. అది పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఒక అప్రకటిత సమతుల్యతా పరిస్థితిని ఏర్పరిచింది. అది రెండు అగ్ర రాజ్యాల (సూపర్ పవర్స్) ప్రపంచ వ్యవస్థగా కొనసాగింది. దానినే ‘రెండు ధ్రువాల ప్రపంచం’ (బై పోలార్ వరల్డ్) అనేవారు. ఆ స్థితి 1991లో USSR పతనం వరకూ కొనసాగింది. ఆ తర్వాత ‘ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థ’ (యూని పోలార్ వరల్డ్) ఏర్పడింది. అది ‘నూతన ప్రపంచ క్రమం’ (న్యూ వరల్డ్ ఆర్డర్) ఉనికిలోకి రావడానికి కారణమైనది. పర్యవసానమే 1991లో ఉనికిలోకి వచ్చిన ప్రపంచీకరణ ప్రక్రియ! అదే LPG ప్రక్రియ!

‘పాత ప్రపంచ క్రమం’ నుండి ‘కొత్త ప్రపంచ క్రమం’ వైపు ప్రయాణించే దారిలో అనివార్యమైన మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రపంచ దేశాల పరిస్థితి కూడా మారాల్సి వుంది. సామ్రాజ్యవాదమే తీవ్ర దురహంకార స్వభావం గలది. అందులో మరింత దూకుడు విభాగానికి ప్రాతినిధ్యం వహించే ఒక ముఠా అమెరికా కేంద్రంగా నాటి ‘నూతన ప్రపంచ క్రమం’ ప్రక్రియకి సారధ్యం వహించింది. దానికి ఒక శక్తిమంతమైన రాజకీయ ప్రతినిధిగా సీనియర్ జార్జ్‌ బుష్ ముందుకొచ్చాడు. USA, USSR మధ్య ప్రచ్చన్న యుద్ధ శకంలో కొనసాగిన ఆయా దేశాల ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సైనిక వ్యవస్థలు మౌలిక మార్పు తీసుకోవాల్సి వచ్చింది. వాటిలో భారత్ కూడా ఒకటి! USSR వెంట భారత్ అనుసరించిన కాలం నాటి భౌతిక స్థితిగతులు యథాతథంగా కొనసాగే అవకాశం ఉండదు. వాటి వస్తుగత స్థితిగతుల్లో ఒక మౌలిక మార్పు తప్పదు. ఆ సమయంలో బాబరీ మసీద్ సమస్య భారతదేశంలో ఎజెండాగా మారింది.

భూగోళంలో ఏ రెండు దేశాల మధ్య ప్రాంతీయ యుద్ధం లేదా యుద్దాలు జరగాలన్నా, వాటి మధ్య తిరిగి శాంతి ఒప్పందాలు కుదరాలన్నా అంతిమ పరిశీలనలో రెండు అగ్ర రాజ్యాల ప్రమేయంతో మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితిని రెండు ధ్రువాల ప్రపంచ వ్యవస్థ సాధ్యం చేస్తుంది. అందుకు పూర్తి భిన్నంగా ఒకే అగ్రరాజ్యం ఏ రెండు దేశాల మధ్య యుద్ధం లేదా యుద్దాల్ని సృష్టించగలిగే స్థానాన్ని లేదా ఎగదోయగలిగే స్థానాన్ని పొంది, తిరిగి శాంతి ఒప్పందాల్ని కూడా అదే అగ్రరాజ్యం శాసించే భౌతిక స్థితిని ‘ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థ’ సాధ్యం చేస్తుంది. పై నియమం ప్రకారం 1991 నుండి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం లేదా యుద్ధ పరిస్థితి ఏర్పడ్డా లేదా దేశంలో అంతర్గత యుద్ధ పరిస్థితి ఏర్పడ్డా ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థకు సారధ్యం వహించే అమెరికా నియంత్రణ చేస్తుంది. 1992 బాబరీ మసీద్ ఘటన, 1998 కార్గిల్ యుద్ధం వీటికి ప్రబల ఉదాహరణలే! భారత ఆర్ధిక, రాజకీయ, సాంఘిక వ్యవస్థలలో ఒక మౌలిక మార్పు చేయడం కోసం చేపట్టిన ప్రక్రియే బాబరీ మసీద్ ఘటన! అటు ప్రపంచ యవనికపై LPG ప్రక్రియ, ఇటు మన భారత దేశ యవనికపై బాబరీ మసీద్ వివాదం దాదాపు ఏకకాలంలో సంభవించాయి. అదేదో అనుకోకుండా జరిగిన యాదృచ్ఛిక ఘటనలు కావు. ఆ రెండింటి మధ్య అంతస్సంబంధం వుంది.

ఒకవైపు బలహీనమైన ప్రభుత్వ వ్యవస్థ పీవీ నర్సింహారావు ప్రభుత్వ సారథ్యంలో కొనసాగే కాలమది. మరోవైపు అంతకంటే బలహీనమైన దుర్భల ప్రతిపక్షం బీజేపీ వాజపేయి, అద్వానీల సారథ్యంలో కొనసాగే కాలమది. పీవీ ప్రభుత్వం తన సాయంపై, తాను ప్రపంచ బ్యాంకు, IMFల ద్వారా ఇప్పించే సాయంపై ఆధారపడి మనుగడ సాగించే కాలమది. బీజేపీని భవిష్యత్తులో సర్కార్ లోకి తెచ్చుకోవడం కోసం ప్రత్యేకంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అమెరికా మీద వుంది. ఆ నేపథ్యంలో ప్రపంచంలో ఏకధ్రువ అగ్రరాజ్యమైన అమెరికా భారతదేశంలో రెండు ధ్రువాల రాజకీయ వ్యవస్థను శాసించింది. ఒకవైపు బాబరీ మసీద్ కూల్చివేతకు బలహీన ప్రతిపక్షమైన బీజేపీని అమెరికా తెర వెనక నుండి ప్రోత్సహించి బలాన్ని అందించింది. మరోవైపు బాబరీ మసీద్ పరిరక్షణ బాధ్యతను చేపట్టకుండా బలహీన పీవీ సర్కార్ ద్వారా తెర వెనక నియంత్రణ చేసింది. ఆ విధంగా అది ఏకకాలంలో భారత్‌లోని రెండు ధ్రువాల రాజకీయ వ్యవస్థను రిమోట్ కంట్రోల్ పద్ధతిలో నియంత్రణ చేయడం గమనార్హం!

బాబరీ మసీద్ భౌతిక కోణంలో అయోధ్య వరకే పరిమితమైన ఆరాధనా స్థలం. దాని విధ్వంసం భారతీయ వైవిద్య భరిత సాంస్కృతిక ప్రక్రియను విధ్వంసం చేసింది. ఆ పరిణామానికి ముందున్న తరాల ప్రజలు ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్ కో సమ్మతి దే భగవాన్’ అనేదాన్ని అనుసరించారు. ఆ తర్వాత పుట్టి పెరిగిన తరం ‘మీ మతం మా మతం, మీ దేవుడు, మా దేవుడు వేర్వేరు’ అనే భిన్నమైన భావజాలాన్ని అనుసరించే పరిస్థితి ఏర్పడింది. అందుకే అది భారతీయ సామాజిక సమైక్యతను మతపర విద్వేష భావజాలమనే విషఖడ్గంతో ధ్వంసం చేసింది. బాబరీ మసీద్ విధ్వంసం ఒక మెగా పొలిటికల్ స్టేజ్ కూప్‌ (STAGE COUP)గా జరిగింది. దాని వ్యూహకర్త మన దేశసరిహద్దుకు ఆవల ఉండటం గమనార్హ అంశం! కానీ మన దేశ ప్రజలలో ఒక విభాగం రాముడిపై భక్తితో బీజేపీ చేపట్టిన ఒక సానుకూల కార్యంగా నమ్మింది. మరో విభాగం మన దేశ మత విద్వేషపూరిత బీజేపీ శక్తుల అనాగరిక చర్యగా భావించింది. కొద్ది శాతం మంది అవగాహనా పరులు తప్ప మన దేశ ప్రజలు బాబరీ మసీద్ అంతర్జాతీయ కుట్రగా చూడలేదు. ప్రబల సామ్రాజ్యవాద రాజ్యాలు అంతర్జాతీయ కుట్రలు సాగించే ప్రక్రియ అత్యంత రహస్యంగా సాగుతుంది. ఆయా దేశాల ప్రజల దృష్టిలో పడకుండా అట్టి కుట్రలు (COUPS) సాగుతాయి. నాటి బాబరీ మసీద్ నుండి నేటి పహల్గామ్ వరకూ అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తుల తెర వెనక కుట్రల్ని అర్ధం చేసుకోవాల్సి వుంది.

(ఇంకా వుంది.)

– ఇఫ్టూ ప్రసాద్ (పిపి), 18-5-2025

 

ఇవి కూడా చదవండి..

Operation Sindoor | ప‌హల్గామ్, ఆప‌రేష‌న్‌ సింధూర్ లేవనెత్తిన ప్రశ్నలివీ..
Operation Sindoor | తాజా ఇండో పాక్ యుద్ధక్రీడలో కర్త, కర్మ, క్రియలపై ఓ విశ్లేషణ – పార్ట్ 1