Vote Chori; IFTU Prasad Opinion | ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదాం
ఓటు చోరీకి పాల్పడే పరిస్థితి బీజేపీకి రావడం దానికో వెనకడుగు! అది ప్రజల ఆలోచనా సరళిలో ముందడుగుకు సంకేతం. మతం, దేవునితో చేపట్టే విద్వేష రాజకీయాల నుండి ప్రజలు క్రమంగా అధిగమిస్తున్న పరిస్థితికి కూడా ఒక సంకేతమే.

Vote Chori | IFTU Prasad Opinion |
*ఓటర్ల ఆలోచనలో పెద్ద ముందడుగుకు ఓ సంకేతం ఓటు చోరీ*
*ఇది ఓటర్ల చైతన్యం పెంపుకు నిదర్శనం*
*ఓటు చోరీ వార్త నాకు ఆనందం కలిగించింది*
ఈ రైటప్ హెడ్డింగులను చూసి నువ్వుకుంటారో లేదా భావ సారూప్యత గల రాజకీయ మిత్రులు తిట్టుకుంటారో! నాకైతే నిజంగానే ఆనందంగా వుంది. పరిస్థితులలో ఇంతలోనే ఇంత మార్పు వచ్చిందా అనే సంతోషం నాకైతే కలుగుతుంది. తాజా ఓటు చోరీ వెలుగు చూసిన తర్వాత చాలా మందిలో తీవ్ర ఆందోళన పెరిగింది. ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష, విప్లవ తదితర స్రవంతులకు చెందిన బుద్దిజీవులతో సహా మానసికంగా తెగ కలత చెందుతున్నారు. ఓట్ల దొంగతనానికి ఇంత బరితెగింపుకు దిగితే, రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం వారికి పట్టుకుంది. చాలా మానసిక కలవరపాటుకు గురవుతున్నారు. ఇదొక బందిపోటు పాలనగా మారుతుందనే భయంతో వణకిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికిది ఆందోళన చెందే పరిస్థితి కాదు. పైగా ఇది ఆనందం పొందాల్సిన సమయం.
విందు, మందు, డబ్బు తదితర ప్రలోబాలతో ఓటర్ల మనస్సులను లోబరుచుకొని ఓట్లు వేయించుకున్నదే “మెంటల్ రిగ్గింగ్” దశ!
ప్రలోబాలతో ఓటర్ల మనస్సుల్ని గెలవలేక బలప్రయోగంతో ఓట్లు గుద్దుకోవడం, బ్యాలెట్ పెట్టెలు ఎత్తుకుపోవడం వంటి చర్యలకు పాల్పడే విధానమే “ఫిజికల్ రిగ్గింగ్” దశ!
పై రెండు రకాల రిగ్గింగ్ ప్రక్రియలు దేశ రాజకీయ రంగంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం వహించే దశలో అమలు జరిగాయి. (ఇందులో ప్రాంతీయ పార్టీలు, కొన్ని జాతీయ పార్టీలు తక్కువ తినలేదు. ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీది కావడం గమనార్హం.) పై రెండు రిగ్గింగ్స్ ని తానొకవైపు చేతనైనంత చేపడుతూ మరోవైపు కాంగ్రెస్ పార్టీని ప్రధాన పొలిటికల్ టార్గెట్ చేసి బహిర్గతపరుస్తూ బీజేపీ వచ్చింది.
దేశ రాజకీయ యవనిక పై బీజేపీ ఆధిపత్యంలోకి వచ్చాక ఇది ఏ రూపం తీసుకుందో చూద్దాం.
పార్లమెంటరీ రాజకీయ రంగంలో బీజేపీ పరిస్థితి భిన్నమైనది. హిందుత్వ భావజాలాన్ని ఫాసిస్టు భావజాలానికి అదనపు ఆయుధంగా జోడించి బలోపేతం చేసింది. కాంగ్రెస్ పార్టీ వలే ఓటర్ల మనస్సుల్ని ప్రలోబాలతో వశీకరణ చేసుకోవాల్సిన అవసరం బీజేపీ పార్టీకి రాలేదు. అది ఉదారవాద విధానాలకు ఆధ్యాత్మిక మతతత్వ భావజాలాన్ని జోడించి ఓటర్ల మెదళ్ళని కలుషితం చేసే ప్రక్రియ చేపట్టింది. బీజేపీ మత విద్వేష భావజాలంతో ప్రభావితమైన ఓటర్లు స్వచ్ఛందంగానే ఓట్లు వేసే ప్రధాన ధోరణిగా ముందుకొచ్చింది. (ఇది ప్రధానంగా మధ్యతరగతి ఓటర్ల మాట) ఓటు చోరీ “ఆధ్యాత్మిక రిగ్గింగ్” గా మారింది. ఈ ప్రక్రియను “స్పిరిట్యుయల్ రిగ్గింగ్” అని కూడా పిలవవచ్చు.
“స్పిరిట్యుయల్ రిగ్గింగ్” జయప్రదంగా సాగడానికి బాబ్రీ, గోద్రాల నుండి పుల్వమా, ఫహల్గంల వరకూ సాధనాలుగా ఉపయోగ పడ్డాయి. అవి పదేపదే చేస్తుంటే అదిగో పులి కధగా మారే స్థితి ఏర్పడింది. మతతత్వ కలుషితం భావజాలంతో మొదట ప్రభావితమైన ఉత్తరాది ఓటర్ల ధోరణి రివర్స్ అవుతోంది. అది బీహార్ ఎన్నికల్లో బీజేపీకి భయం పట్టుకుంది. ఈ భయం బీహార్ ఎన్నికల వరకే పరిమితం కాదు. ఇక సార్వత్రిక రూపంగా డిజిటల్ రిగ్గింగ్ ప్రక్రియకి వెళ్ళడానికి బీహార్ ఒక ప్రయోగశాలను చేస్తోంది. డిజిటల్ రిగ్గింగ్ ను ఆశ్రయించాల్సిన కొత్త దుస్థితి మోడీ సర్కార్ కి ఏర్పడడం బలం కాదు, అది దాని బలహీనతే.
1. మెంటల్ రిగ్గింగ్
అది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీది.
2. ఫిజికల్ రిగ్గింగ్
అది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీది.
3. స్పిరిట్యుయల్ రిగ్గింగ్
మహారాష్ట్రలో శివసేన తప్ప దీనికి పాల్పడ్డది దేశంలో బీజేపీ మాత్రమే.
4. డిజిటల్ రిగ్గింగ్
ఇది శివసేన కూడా లేకుండా బీజేపీ ఏకైక ప్రాతినిధ్యం వహిస్తోంది.
భగవంతుడి ఆధారిత ఆధ్యాత్మిక భావజాలం మీద, మతం ఆధారిత విద్వేష భావజాలం మీద, ఇంకా జాతీయోన్మాద దురభిమాన ప్రచారం ద్వారా ఓటర్ల మెదళ్ళని విషపూరిత ప్రచారంతో ప్రభావితం చేసి ఓట్లను కొల్లగొట్టగలమనే బీజేపీ అంచనా బెడిసికొట్టే కొత్త పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో వలే దేవుడు, మతం, మతతత్వం తమకు అధికారాన్ని అందిస్తాయనే నమ్మకం వమ్ము అవుతోంది. అది డిజిటల్ యంత్రాల పై ఆధారపడి ఓట్ల చోరీకి దిగాల్సిన దుస్థితికి నెట్టబడింది. నిజానికి ఇదో ఆశాజనకమైన సానుకూల పరిణామం.
ఆధ్యాత్మిక రిగ్గింగ్ కి వ్యతిరేకంగా సాగించే పోరాటం కంటే, డిజిటల్ రిగ్గింగ్ కి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉంటుంది. ఈ వారం రోజులలో అది రుజువవుతూనే వుంది. ఆధ్యాత్మిక రిగ్గింగ్ మతం, దేవుడితో ముడిపడ్డ సున్నితమైన సమస్య. కానీ డిజిటల్ వ్యవస్థ మోసాలని బట్టబయలు చేస్తూ చేపట్టే పోరాటంలో ప్రజా సమీకరణకు బాగా ఉపయోగపడుతుంది.
బీజేపీ ఇంతవరకూ తాను ఏ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని గెలవగలనని నమ్మిందో, ఏ విద్వేష మతతత్త్వంతో ఓటర్ల మెదళ్లను ప్రభావితం చేసి విజయం సాధించగలనని నమ్మకం పెట్టుకుందో, ఆ నమ్మకాలు నేడు వమ్ము కావడం విశేషం. అందుకే దేవుడు, మతం వదిలేసి డిజిటల్ యంత్రాల్ని కొత్త దేవుడిగా కొలుస్తున్నది. ఇది బీజేపీ బలహీనత తప్ప బలం కాదు.
ఓటు చోరీకి పాల్పడే పరిస్థితి బీజేపీకి రావడం దానికో వెనకడుగు! అది ప్రజల ఆలోచనా సరళిలో ముందడుగుకు సంకేతం. మతం, దేవునితో చేపట్టే విద్వేష రాజకీయాల నుండి ప్రజలు క్రమంగా అధిగమిస్తున్న పరిస్థితికి కూడా ఒక సంకేతమే.
ఇకముందు బీజేపీకి ఆధ్యాత్మిక రిగ్గింగ్ ఫలితాలను ఇవ్వదని కాదు. దానికి కాలదోషం పట్టిందని కాదు. అది మున్ముందు ప్రాసంగికత కోల్పోయిందని కాదు. మరో రూపంలోనైనా పుల్వమా, ఫల్గామ్ ఘటనలు జరగవనీ, వాటిపై ఆధారపడదనీ కాదు. కానీ అదొక్కటే గట్టెక్కించే ప్రక్రియ కాదనే అవగాహనకు బీజేపీ వచ్చిందనేది ని స్పష్టం. సాంప్రదాయ భావజాలం ఉపకరించే అవకాశం లేదని బీజేపీకి భయం పట్టుకుందనేది నిజం. అది ముమ్మాటికీ బీజేపీ వెనకడుగుకు నిదర్శనం.
ప్రజల ముందడుగును వెనకడుగుగా అపోహకి గురై భాయపడిపోతున్న పరిస్థితి ప్రజాస్వామ్య శక్తులకు రాకూడదు. బీజేపీ వెనకడుగు వేస్తే అదో దూకుడు అడుగుగా అపోహకు గురై భీతిల్లే స్థితి ప్రగతిశీల శక్తులకు రాకూడదు. మన ప్రజలు ఒక్కొక్క ముందడుగు వేస్తున్నారు. వారు వేసే ప్రతి ముందడుగును సాగతించుదాం. అది ఎంత చిన్నదైనా, ఎంత తాత్కాలిక స్వభావంతో కూడినదైనా గుర్తిద్దాం. ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి వాటిని సద్వినియోగం చేద్దాం. ఆ ప్రజల ముందడుగుల వెలుగులో పురోగామి సామాజిక, రాజకీయ శక్తులు ముందడుగులు వేస్తాయని ఆశిద్దాం. ఈ స్ఫూర్తితో ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదాం.
– ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
14-8-2025