Plastic Problem | ప్లాస్టిక్ బారినపడి గర్భంతో ఉన్న ఏనుగు మృతి: వన్యప్రాణుల మనుగడకు పెను ముప్పు!

పర్యాటక ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు సందర్శనల కోసం వెళ్లే మనం విసిరిపారేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు అటవీ జంతువుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల తమిళనాడులోని మరుధమలై కొండల్లో గర్భంతో ఉన్న ఒక ఏనుగు మృతి చెందింది. పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో.. ఆ ఏనుగు మరణానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు తినడమే కారణమని తేలింది.

Plastic Problem | ప్లాస్టిక్ బారినపడి గర్భంతో ఉన్న ఏనుగు మృతి: వన్యప్రాణుల మనుగడకు పెను ముప్పు!

Plastic Problem | అటవీ ప్రాంతాలు వన్యజీవుల ఆవాసం. అక్కడకు పర్యాటకులు, సందర్శకుల పేరుతో వెళుతున్న మనం.. వాటి ఆవాసాలను నాశనం చేస్తున్నాం. యథేచ్ఛగా ఉపయోగించి పారేసే ప్లాస్టిక్‌తో అటవీ ప్రాంతాలు నిండిపోతున్నాయి. ఏదో ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న ఆహారాన్ని తినే క్రమంలో అడవి జంతువులు ఆ ప్లాస్టిక కవర్‌ను కూడా తినేస్తున్నాయి. అవి వాటి ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోని మనం.. మన టూర్‌ ముగియగానే ఇంటికి వచ్చేస్తున్నాం. కానీ.. ఆ మూగ జీవాలు మాత్రం.. ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఘటన.. తమిళనాడులోని మరుధమలై కొండల్లో చోటు చేసుకుంది. ఇటీవల ఇక్కడ 15 నెలల గర్భంతో ఉన్న ఓ ఏనుగు అనారోగ్యంతో మరణించడం పర్యావరణవేత్తలను, వన్యప్రాణి సంరక్షకులను తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద ఘటనకు ప్లాస్టిక్ వ్యర్థాలను తినడమే ప్రధాన కారణమని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడవడంతో, ప్లాస్టిక్ కాలుష్యం వన్యప్రాణులకు ఎంతటి ముప్పుగా పరిణమించిందో మరోసారి స్పష్టమైంది.

పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ విజృంభణ

మరుధమలై వంటి పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు ఉన్న అటవీ ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఈ దుర్ఘటన తర్వాత, ఊటీ, కొడైకెనాల్ వంటి పర్వత ప్రాంతాల్లో మాదిరిగానే అటవీ ప్రాంతాల్లోని ఆలయాల పరిసరాల్లోనూ ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగులపై పూర్తి నిషేధం విధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ కనుమల్లోని కోయంబత్తూరు డివిజన్ పరిధిలో ఉన్న మరుధమలై అటవీ ప్రాంతం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతో పాటు ఏనుగులు, చిరుతపులులు, అడవి పందుల వంటి వన్యప్రాణులకు ఆవాసం. మే 17న, ఈ అటవీ ప్రాంతంలో ఓ ఆడ ఏనుగు, దాని పక్కనే ఒక గున్న ఏనుగు అపస్మారక స్థితిలో కనిపించాయి. అటవీ శాఖ అధికారులు క్రేన్ సహాయంతో ఆడ ఏనుగును రక్షించి, ఐదుగురు పశువైద్యులతో చికిత్స అందించినప్పటికీ, ఏనుగు ప్రాణాలు నిలవలేదు. పోస్ట్‌మార్టమ్‌లో ఆ ఏనుగు 15 నెలల గర్భంతో ఉందని, కడుపులోని పిల్ల కూడా చనిపోయిందని తేలింది. అంతేకాకుండా, ఏనుగు కడుపు నిండా ప్లాస్టిక్, పాలిథిన్, కాగితపు వ్యర్థాలు భారీగా పేరుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. పశువైద్యులు మాట్లాడుతూ, “ఆ ఏనుగు అప్పటికే శరీరంపై గాయాలు, పలు అవయవాల వైఫల్యంతో బాధపడుతోంది. కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, విషపూరిత ఆహారం తినడమే దాని మరణానికి ప్రధాన కారణం” అని స్పష్టం చేశారు.

పేడలోనూ ప్లాస్టిక్ అవశేషాలు

మరణించిన ఏనుగు చిన్న, పెద్ద పేగులు ప్లాస్టిక్ వ్యర్థాలు, అల్యూమినియం రేకులతో నిండిపోయాయని డాక్టర్లు నిర్ధారించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని ఇతర ఏనుగుల పేడలోనూ దాదాపు 70 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. అడవి పందుల వంటి జంతువులకు నాలుగు కడుపు గదులు ఉంటాయని, ప్లాస్టిక్ తింటే అవి ఇబ్బందిపడతాయని, అయితే ఏనుగుకు ఒకే గది ఉండటం వల్ల ప్లాస్టిక్ పేడతో పాటు బయటకు వెళ్తుందని, కానీ అది అధిక మోతాదులో ప్లాస్టిక్ తినడం వల్లే మరణం సంభవించిందని పశువైద్యులు వివరించారు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో చనిపోయిన మరో ఏనుగు కడుపులోనూ కిలోల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడటం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. సోమాయంపాళ్యం పంచాయతీ సేకరించిన చెత్తను అటవీ ప్రాంత సమీపంలోని ఖాళీ స్థలంలో డంప్ చేయడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలున్నాయి. ఈ ఘటన తర్వాత కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ ఆదేశాలతో ఆ చెత్త డంప్‌ను తొలగించారు. అయితే, మరుధమలై దేవాలయం, పరిసర అటవీ ప్రాంతాలలో వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులను మాత్రం పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు.

ప్రభుత్వ చర్యలు, పర్యావరణవేత్తల డిమాండ్లు

జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, “బయో మైనింగ్ ద్వారా చెత్తను తొలగిస్తాం. ఏనుగులు సహా వన్యప్రాణులు ఆ ప్రాంతానికి రాకుండా ఆధునిక ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. వ్యర్థాలు వాటికి కనిపించకుండా ఆ ప్రాంతం చుట్టూ చెట్లను పెంచుతాం” అని తెలిపారు. అయితే పర్యావరణవేత్తలు ఆ చెత్త డంప్‌ను అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే 14 రకాల సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిందని, వాటన్నింటినీ వేరే చోటకు తరలించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదని తమిళనాడు అటవీశాఖ కార్యదర్శి సుప్రియా సాహు చెప్పారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న అన్ని వ్యర్థాల డంప్‌లను పరిశీలించాలని అన్ని జిల్లాల్లోని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు జంతువులలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయని, వాటి పునరుత్పత్తిపై ప్రభావం చూపుతాయని ఒక అధ్యయనం వెల్లడించింది. అటవీశాఖ ఏటా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్లాస్టిక్ కాలుష్యం వన్యప్రాణుల మనుగడకు, ముఖ్యంగా ఏనుగులకు ఎంతటి ప్రమాదమో ఈ విషాద ఘటన స్పష్టం చేస్తోంది.