పాపం కిషన్ రెడ్డి..సీఎంల తిట్ల దండకానికి బలి !

కేసీఆర్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.

గంగాపురం కిషన్ రెడ్డి. ఈ పేరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు తెలిసిన వారందరికి సుపరిచితమే. 1977లో జనతా పార్టీ యువ నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 1980నుంచి బీజేపీ పార్టీలో క్రీయాశీలక నేతగా పనిచేస్తూ..ఆ పార్టీ ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎదిగారు. బీజేపీ పార్టీకి సంబంధించి వివిధ రాష్ట్రాల ఇంచార్జ్ గా కూడా వ్యవహరించారు. ప్రజాసేవ పరంగా, రాజకీయంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నప్పటికిని..తెలంగాణ రాష్ట్ర తొలి సీఎంగా పనిచేసిన కేసీఆర్ కు, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిలకు మాత్రం ఆయన తిట్ల రాజకీయాల ఆటలో ఓ పావుగా మారిపోవడం విషాదకరం.

బీజేపీపై దాడికి వారికి కిషన్ రెడ్డినే టార్గెట్

గతంలో కేసీఆర్ సీఎంగా వ్యవహరించిన కాలంలో కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అనుసరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు సాగించే సందర్బంలో కేసీఆర్ రాష్ట్రంలో బీజేపీ ప్రధాన నేతగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం పరిపాటిగా సాగించారు. ఓ దశలో ఆయన కిషన్ రెడ్డిని రండ..చేతగాని దద్దమ్మ అన్న అనుచిత పదజాలంతో సైతం విమర్శించడం దుమారం రేపింది. ఓ రకంగా కిషన్ రెడ్డిపై కేసీఆర్ వాడిన భాషను విన్న వారికి ఆయనపై సానుభూతిని సైతం కల్గించింది. మోదీ 2.0సర్కార్ పై యుద్దం ప్రకటించిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అధికారాన్ని కూడా కోల్పోగా..బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైపోయింది. ఇక పాపం కిషన్ రెడ్డికి తిట్లదండకం ప్రమాదం తప్పినట్లే అనుకుంటే..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సీఎం సైతం కిషన్ రెడ్డిని కేసీఆర్ తరహాలోనే విమర్శిస్తుండటం చర్చనీయాంశమైంది. చిత్రంగా కేసీఆర్, రేవంత్ రెడ్డిలు కిషన్ రెడ్డిని విమర్శించిన సందర్బాలు …యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును ప్రశ్నించిన సందర్బాలే కావడం యాదృచ్చికం.

దొంగది కాదు..దొడ్లకి రాదు అంటూ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ భగాయత్ సభలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి సహకారం దక్కకుండా కిషన్ రెడ్డినే అడ్డుపడుతున్నాడని పునరుద్ఘాటించారు. కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ నెల 15న తర్వాత కార్యాచరణ ఉంటుందని, ఆయనను పొలిమేర దాటనివ్వమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా నేను బీజేపీలో పుట్టినా…బీజేపీలోనే చస్తా అని కిషన్ రెడ్డి చెప్పుకున్న మాటలను, రేవంత్ రెడ్డి మాదిరిగా పది పార్టీలు మారలేదంటూ తనపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ వేశారు.

కిషన్ రెడ్డి మాటలు కరెక్టే అని..ఆయన బీజేపీలోనే ఉంటాడని..చీకట్లో అవతలోడితో సహకారం తీసుకుంటాడని, అసలు ఆయన ఆ పార్టీకి ఎప్పుడైనా పని చేశాడా ? అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలే చెబుతున్నారని మా కిషన్ రెడ్డి సార్ బీజేపీలో ఉంటాడుగాని మొత్తం బీఆర్ఎస్ తోనే మాట్లాడుతుంటాడని, కేటీఆర్ చెప్పినట్లే వింటాడని బీజేపీ కార్యకర్తలే చెబుతున్నారని చురకలేశారు. అలాంటి నీకు పార్టీ మారే అవసరం లేదని..ఉన్నదాంట్లోనే ఉంటూ..పక్కదాంట్లో తింటావు అని, కిషన్ రెడ్డి తీరు దొంగది కాదు..దొడ్లకి రాదు అన్న సామేత మాదిరిగా ఉందంటూ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. దీంతో మరోసారి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎంల బూతు భాషకు టార్గెట్ అయిపోయాడు. అయితే తనను రేవంత్ రెడ్డి ఎంత రెచ్చిగొట్టినా రెచ్చిపోనని..కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందంటూ కిషన్ రెడ్డి మాట్లాడటం ఈ తిట్లదండకంలో మరోసారి ఆయనకు సానూభూతిని అందించే ఆంశంగా మిగిలింది.

Latest News