రెండు అసెంబ్లీ సీట్లలో వారసుల కుంపట్లు…కాంగ్రెస్ నేతల అసమ్మతి పోరు

పాలకుర్తి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో వారసుల రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రచారాల మధ్య కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు, అసమ్మతి స్వరాలు చర్చనీయాంశంగా మారాయి.

అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మిగిలి ఉంది. ఈ లోపు తమ వారసులకు రాజకీయంగా ఇబ్బందులు లేకుండా నియోజకవర్గాలకు ఎంపిక చేసే పనిలో తండ్రులు ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అర డజన్ మంది నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు ముందు వేస్తున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు అదనంగా మరో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పార్టీలో అసమ్మతి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడం మూలంగా అంతర్గత పోరు, విభేధాలు మొదలయ్యాయి. పీసీసీ నాయకత్వం కూడా అంతర్గత పోరు, గ్రూపు రాజకీయాలపై కఠినంగా వ్యవహరించకపోవడంతో నాయకులకు కలిసి వస్తున్నదని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల మూలంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు విజయానికి దారి చూపినవారు అవుతారని గాంధీ భవన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వారసులు, భార్యలకు టిక్కెట్లు కేటాయించి కుటుంబ పార్టీగా కాంగ్రెస్ కు అపఖ్యాతి వచ్చిందంటున్నారు.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి వివాహం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డితో జరిగిన విషయం తెలిసిందే. ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాలలో ఎక్కువగా రిజర్వుడు నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. వరంగల్ లో జనరల్ కేటగిరీలో పార్లమెంటు సీటు లేకపోవడంతో రఘురామ్ రెడ్డి ఖమ్మం నుంచి పోటీ చేసి విజయం సాధించింది విధితమే. తన కుమారుడిని ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఆరంగేట్రం చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సన్నిహితులు చర్చించుకుంటున్నారు. తమ స్వంత జిల్లా కావడంతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సత్సంబంధాలు కలిసి వస్తాయనే ఉద్ధేశంతో పాలకుర్తి ని ఎంపిక చేసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నియోజకవర్గం నుంచి యశస్విని రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈమె మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై పోటీ చేసి విజయం సాధించారు. అయితే యశస్విని రెడ్డి స్థానికురాలు కాకపోవడం, అత్త ఝాన్సీ రెడ్డి మొన్నటి వరకు అమెరికాలో వ్యాపారాల్లో నిమగ్నం కావడం మైనస్ గా మారిందని నియోజకవర్గ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎంపీ రఘురామ్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే టాక్ నడుస్తోంది. మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో తమ వర్గం వారిని యశస్వీని రెడ్డిపై ప్రోత్సహించగా, ఈ పంచాయతీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ వరకు వెళ్ళింది. యశస్విని పట్ల ఆగ్రహంగా ఉన్న నేతలకు వీరిద్దరి నుంచి మద్ధతు పుష్కలంగా లభిస్తుండడం విశేషం. రఘురామ్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కి జిల్లాలో రాజకీయంగా మంచి పట్టు ఉండడం కూడా కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఉమ్డి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సీ దామోదర రాజనర్సింహ తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన విషయం తెలిసిందే. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఒక్క కుమార్తె త్రిష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహంగా ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఆందోల్ నుంచి బరిలో నిల్చునే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గాన్ని ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నారని రాజనర్సింహ అనుచరులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బరిలో నిలబెడితే ఎలా ఉంటుందంటూ సన్నిహితుల వద్ద కూడా ప్రస్తావించి అభిప్రాయాలు సేకరించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి పట్లోళ్ల నర్సింహా రెడ్డి, మహ్మద్ ఫరీదుద్దీన్, డాక్టర్ జే గీతారెడ్డి లు గెలుపొందగా ప్రస్తుతం కొనింటి మాణిక్ రావు (బీఆర్ఎస్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ పై మాణిక్ రావు విజయం సాధించారు. నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ ఛార్జీగా చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. వికారాబాద్ లో టికెట్ లభించకపోవడంతో ఆయన తప్పని పరిస్థితుల్లో జహీరాబాద్ నుంచి ఆయన పోటీ చేశారు. వలస నేత అంటూ చంద్రశేఖర్ పై ఇద్దరు నేతలు అసమ్మతి రాజేశారు. ఆయనను తప్పించాలని నియోజకవర్గంలో కొందరు లీడర్లు గళం పెంచారు. అయితే అసమ్మతిని మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ షెట్కార్ వెనక ఉండి నడిపిస్తున్నారా అంటే అవుననే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఉల్వల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి లు చంద్రశేఖర్ కు మద్ధతుగా ఉన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు పట్ణణాలకు పార్టీ అధ్యక్షులను నియమించడంతో ఇద్దరు నాయకులు అంతర్గత కుమ్ములాటలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. షెట్కార్ అసెంబ్లీ నియోజకవర్గం నారాయణ ఖేడ్ కాగా చివరి నిమిషంలో సంజీవ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జహీరాబాద్ రెండు అవుతుందని, తనకు టికెట్ ఖాయమని షెట్కార్ ధీమాలో ఉన్నారు. తను సిట్టింగ్ ఎంపీ కావడంతో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాదని ఆయన పనులు చేయిస్తున్నారు. ఇక్కడి నుంచి షెట్కార్ పోటీ చేస్తారా లేదా ఆయన కుమార్తెను బరిలోకి దింపుతారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. ఈ సీటుపై రాజనర్సింహ కూడా కన్నేశారు. తన కుమార్తె లేదా తానే స్వయంగా బరిలోకి దిగాలనే పట్టుదలతో హైకమాండ్ వద్ద చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ఇన్ ఛార్జీ బాధ్యతల నుంచి చంద్రశేఖర్ ను తప్పించాలని నాంపల్లి గాంధీభవన్ లో ధర్నా చేయించిన వారి వెనకాల ఈయనే ఉన్నారనే వార్త గుప్పుమంటోంది.

Latest News