Gutha sukender reddy: ప్రజలు చీదరించుకుంటున్నారు

నాయకులు మాట్లాడే భాషపై ఆత్మవిమర్శ చేసుకోవాలి
Gutha Sukender Reddy | విధాత : ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు మాట్లాడే భాషపై.. ఆత్మవిమర్శ చేసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రజల్లో ఈసడింపు ఉంది.. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మసలుకోండి అని సూచించారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం అని చెప్పారు. సోమవారం నల్గొండ లోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు విలువలను పాటించాలి.. ప్రజలు ఈసడిoచుకుంటున్నారని తెలిపారు. దేశంలో పలు రాష్ట్రాల్లో అవినీతి పెరుగుతుందన్నారు. కేంద్రం, సుప్రిoకోర్టు, ఈసీ ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలపై నియంత్రణ తీసురావాలని, ఉచితాలతో ప్రభుత్వాలపై అదనపు భారం పడుతోందన్నారు. ఉచితాలతో.. తెలంగాణ ప్రజలు కష్టపడి పనిచేసే తత్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వం వైపు చేయి చాపాల్సిన అవసరం ఉండొద్దని.. ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలకు పని, ఉపాధి కల్పించడం మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఇరిగేషన్ శాఖలో అధికారులు అవినీతి అంతా, ఇంతా కాదని, ఎస్టిమేషన్ పెంచి భారీ దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జయలలిత, వైఎస్ .రాజశేఖర్ రెడ్డి పోయేటప్పుడు ఏమి తీసుకోలేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ వ్యతిరేకం అని స్పష్టం చేశారు. కవిత – తీన్మార్ మల్లన్న విషయంలో.. అందరూ సంయమనం పాటించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.