మా ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు : హరీశ్ రావు సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ నేతల ఫోన్లు, ఇళ్ల ముందు సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. క్రిశాంక్‌పై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : కొంత మంది ఐపీఎస్ అధికారులు మా బీఆర్ఎస్ నేతల ఫోన్లు, ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

బెంగుళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లకు పైసలు చెల్లించి తీసుకొచ్చి.. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోబెట్టి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు, ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. హ్యాకింగ్ కు సంబంధించి మా దగ్గర అన్ని సాక్షాధారాలు ఉన్నాయి అని, టైం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాం అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక హ్యాకింగ్ పాల్పడుతున్న అధికారులను రిటైర్డ్ అయినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎవరైతే హాకింగ్ చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం అన్నారు. అప్పుడు మిమ్మల్ని రేవంత్ రెడ్డి కాపాడలేరు..ఇంకెవరు కాపాడలేరని, మీ సొంత డబ్బులతో లాయర్లను పెట్టుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం మని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారు.ముఖ్యమంత్రి, హోం మంత్రి రెండు బాధ్యతలూ రెండు సీఎం వద్దనే పెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నాడని, ఇదేనా మీ ప్రజాస్వామ్యం? క్రిశాంక్ పై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని సాక్షాత్తూ మెజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారంటేనే మీ కక్షసాధింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు.

అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్, హెచ్‌సీయూ గచ్చిబౌలి భూములు, సోమ్ డిస్టిలరీస్ వ్యవహారం, మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ వివాదం.. ఇలా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే ఆయనపై వరుసగా కేసులు పెట్టారని హరీశ్ రావు ఆరోపించారు. లగచర్లలో గిరిజనుల పైనా, మెదక్, సంగారెడ్డిలో మా నాయకుల పైనా అక్రమ కేసులు బనాయించారని, రేవంత్ రెడ్డి ఇలా కేసులు పెట్టి మళ్లీ గెలుస్తాననుకుంటే అది హిట్లర్ ను మించిన మూర్ఖత్వమే అవుతుందన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చుని నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటున్నాడని, మీ అరాచకాలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. క్రిశాంక్ ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతున్నాడు అని, మీ పార్టీ కార్యాలయంలో జరిగే అవినీతి, అక్రమాల వ్యవహారాలన్నీ రికార్డు అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నాడని విమర్శించారు.పంటల కొనుగోలు జరుగక రైతాంగం రేవంత్ పాలనలో అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మన్నె క్రిశాంక్ కు బెయిలు రాకుండా.. మళ్లీ కేసులు పెట్టి జైలులో పెట్టేలా ప్రభుత్వం చూడకుండా చట్టబద్దంగా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. క్రిశాంక్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని,మళ్లీ పీటీ వారెంట్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకబోమన్నారు. ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేసి, ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు గురించి రేవంత్ ఆలోచించాలని..మిగిలిన రెండేళ్లయినా ప్రజలు మెచ్చే పాలన అందించాలని, ఎలాగు మళ్లీ కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు.

ఇవి కూడా చదవండి :

Titles | టాలీవుడ్‌లో టైటిల్ టెన్షన్.. స్టార్ హీరోల కొత్త సినిమాల పేర్లపై ఫ్యాన్స్ అసంతృప్తి
హర్భజన్ కు పోలీసు సెక్యురిటీ తొలగింపు …మరునాడే సీఐఎస్ఎఫ్ కేటాయింపు

Latest News