YS Jagan| వైఎస్ జగన్ బంగారు పాళ్యం పర్యటనలో హైటెన్షన్

అమరావతి : వైసీసీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన భారీ పోలీసు బందోబస్తు..వైసీపీ శ్రేణుల హంగామాలతో ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. జగన్ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. బంగారు పాళ్యం హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ లో మార్కెట్ యార్డుకు బయలు దేరారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి, బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో జగన్‌తో మాట్లాడేందుకు 500 మందికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎలాంటి రోడ్‌షోలు, ర్యాలీల నిర్వహించారదని పోలీసులు షరతులతో కూడిన అనుమతిచ్చారు. అయితే పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు భారీగా తరలిరాగా పోలీసులు వారిని నియంత్రించేందుకు పలుచోట్ల లాఠిచార్జి చేశారు. పోలీసుల లాఠిచార్జిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించేందుకకు జగన్ తన కాన్వాయ్ దిగే ప్రయత్నం చేయగా ఎస్పీ అడ్డుకున్నారు. మా పార్టీ కార్యకర్తలను ఎందుకు కొడుతున్నారంటూ ఈ సందర్భంగా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితో పోలీసులు మాత్రం జగన్ ను కాన్వాయ్ నుంచి దిగకుండా ముందుకు పంపించారు.
జగన్ కాన్వాయ్ నుంచే కార్యకర్తలకు అభివాదం చేస్తూ బంగారు పాళ్యం మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ ఆయన మామిడి రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. మరోవైపు పోలీసుల ఆంక్షలను భేఖాతర్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు గేట్లు తోసుకొని మార్కెట్ యార్డులోకి లోపలికి చొరబడ్డారు. అంతకుముందు జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలకు విరుద్దంగా జనసమీకరణకు యత్నించిన 370మందికి పైగా వైసీపీ నాయకులకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ శ్రేణులను ముందస్తుగా కట్టడి చేసేందుకు పోలీసులు చెన్నై-బెంగళూరు జాతీయరహదారిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి చాల మందిని వెనక్కి పంపించేశారు. ఇటీవల జగన్ చేపట్టిన పర్యటనలు వివాదస్పదం కావడంతో ఈ ధఫా పోలీసులు ఆంక్షలతో కూడి బందోబస్తు మధ్య పర్యటనకు అనుమతించారు.