హ్యాట్రిక్ పై గురి!.. మూడోసారి గెలిచేందుకు ఎమ్మెల్యేల కసరత్తు

- పాలమూరు జిల్లా చరిత్రలో హ్యాట్రిక్ విజయాలు తక్కువే
- హ్యాట్రిక్ కోసం తొమ్మిది మంది ఎమ్మెల్యేల ఎదురుచూపు
- మూడో వరుస విజయంపై ఎమ్మెల్యేల్లో గుబులు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో తొమ్మిది మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ పై దృష్టి పెట్టారు. ముచ్చటగా మూడోసారి గెలిచి తమ బలం ఏంటో నిరూపించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో గెలుపు కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు మూడో గెలుపు ముందు బొక్కబోర్లా పడ్డారు. కొద్ది మంది ఎమ్మెల్యేలకు మాత్రమే మూడో సారి గెలుపు సాధ్యమైంది. జిల్లాలో కొంత మంది ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ సాధించడంలో విఫలం చెందారు. 2023 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేల చరిత్ర లేదు. గతంలో టీడీపీ అభ్యర్థి పి. చంద్ర శేఖర్ నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా వరుసగా విజయం సాధించడంలో విఫలం చెందారు. వరుసగా రెండు సార్లు గెలిచి మూడో సారి విజయం అందుకోలేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పులి వీరన్న విజయం సాధించి రెండోసారి ఓటమి చెందారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి చేతిలో పులి వీరన్న ఓటమి చెందారు.
2011 లో రాజేశ్వర్ రెడ్డి అకాల మరణంతో 2012 లో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎన్నం ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి, ఉద్యమ నేత శ్రీనివాస్ గౌడ్ విజయం పొందారు. 2018 లో కూడా రెండో సారి శ్రీనివాస్ గౌడ్ గెలిచారు. 2023 ఎన్నికల్లో మూడోసారి విజయం పొందేందుకు శ్రీనివాస్ గౌడ్ ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఆయన గెలిస్తే పాలమూరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన మొదటి ఎమ్మెల్యే గా చరిత్ర సృష్టిస్తారు.
దేవరకద్ర నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ప్రస్తుతం ఉన్న బీఆరెస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉంది. ఆయన 2014, 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రస్తుతం జరుగబోయే ఎన్నికల్లో గెలుపొంది ఈ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించాలని అనుకొంటున్నారు. గతంలో సీతా దయాకర్ రెడ్డి ఒక్కసారే ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండో సారి పోటీ చేసినా ఆమె విజయం పొందలేదు. 2007లో ఈ నియోజకవర్గం ఏర్పాటయింది. అంతకుముందు అమరచింత నియోజకవర్గం పరిధిలో ఉండే దేవరకద్ర అనంతరం నియోజకవర్గంగా మారింది. 2009లో ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డి పై విజయం సాధించింది.
మక్తల్ యోజకవర్గంలో
ఈ నియోజకవర్గం బీఆరెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నారు. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించి వచ్చే ఎన్నికల్లో ( 2023 )హ్యాట్రిక్ గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు.ఇక్కడ మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే లు ఎవరు లేరు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి తండ్రి చిట్టెం నర్సిరెడ్డి రెండు సార్లు మాత్రమే గెలిచి మూడో సారి ఓటమి చెందారు. టీడీపీ అభ్యర్థి ఎల్లారెడ్డి కూడా ఈ నియోజకవర్గం లో రెండు సార్లు గెలుచి మూడో సారి ఓడిపోయారు. ఈ నియోజకవర్గం లో వరుసగా మూడో సారి గెలుపు ఎవ్వరికి దక్కకపోవడంతో ఈసారి రామ్మోహన్ రెడ్డి హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించెందుకు ప్రచారంలో దూసుకెలుతున్నారు. ఆయనకు ఓటర్లు హ్యాట్రిక్ అందిస్తారో లేదో వేచిచూడాలి.
నారాయణ పేట నియోజకవర్గంలో
ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి ముచ్చటగా మూడో సారి గెలుపు కోసం అడుగులు వేస్తున్నారు. ఈ నియోజకవర్గం 2007లో ఏర్పాటు కావడంతో 2009లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎల్లారెడ్డి గెలిచి తొలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు.
జడ్చర్ల నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి వరుసగా రెండుసార్లు విజయం పొందారు. ఆయన కూడా మూడో సారి గెలిచి చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వరుసగా మూడో సారి గెలిచిన ఎమ్మెల్యేలు లేరు. గతంలో నర్సప్ప, కృష్ణా రెడ్డి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేలు గా ఎన్నికయ్యారు. మూడో సారి పోటీ చేసినా విజయం దక్కలేదు. వీరిద్దరూ హ్యాట్రిక్ సాధించడంలో విఫలం చెందారు. వీరి తరువాత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఇప్పుడు అవకాశం వచ్చింది. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదల తో ఉన్నారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గం లో బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా మూడో గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో నాగం జనార్దన్ రెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. నాగం నాలుగు సార్లు గెలుచి గెలిచినియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. మళ్ళీ ఆ అవకాశం ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి వచ్చింది. ఈ సారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం పొందుతారు. మూడో సారి గెలిచేందుకు ఇప్పటికే నియోజకవర్గం లోని గ్రామాలలో ప్రచారం పూర్తిచేశారు.
అచ్చంపేట నియోజకవర్గంలో
ఇప్పటివరకు ఈ నియోజకవర్గం లో వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే లు లేరు. ప్రస్తుతం ఉన్న బీఆరెస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వరుసగా 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు రెండు సార్లు గెలిచినా వరుసగా ఎన్నిక కాలేదు. మధ్య మధ్యలో ఓటమి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ, టీడీపీ అభ్యర్థి రాములు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రాములు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతున్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గం లో ఇప్పటివరకు హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే లు లేరు. ప్రస్తుతం బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అబ్రహం వరుసగా ఎమ్మెల్యే గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి నియోజకవర్గం లో చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నారు.గతంలో ఇక్కడి ఎమ్మెల్యే లు వరుసగా రెండు సార్లు విజయం పొందలేక పోయారు. రెండు శార్లు విజయం అందుకున్న అబ్రహం కు ఈ అవకాశం ప్రస్తుతం అబ్రహం కు ఉంది.
షాద్ నగర్ నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గం బీఆరెస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రెండు సార్లు వరుసగా విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం మూడో సారి గెలిచి హ్యాట్రిక్ పొందే పనిలో పడ్డారు. ఈ మేరకు ప్రచారం మొదలుపెట్టిన ఆయన షాద్ నగర్ అభివృద్ధి నే ప్రచార అస్రoగా వాడుతున్నారు. గతంలో ఈ నియోజకవర్గం లో 1999, 2004 లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ రావు విజయం పొందారు.2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి రావడంతో శంకర్ రావుకు మూడో సారి పోటీ చేసే అవకాశం రాలేదు. 2014, 2018 లో బీఆరెస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ వరుసగా విజయం పొంది ప్రస్తుతం వస్తున్న ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు ఉరక లేస్తున్నారు.
వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు
గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఆమె విజయానికి బ్రేక్ పడింది. కొల్లాపూర్ నియోజకవర్గం లో జూపల్లి కృష్ణా రావు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నారు. ఈయన కూడా 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్ష వర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. జూపల్లి వరుస గెలుపులకు పులిస్టాప్ పడింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగం జనార్దన్ రెడ్డి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. 2014 లో మర్రి జనార్దన్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో సూదిని జైపాల్ రెడ్డి ( దివంగత ) వరుసగా మూడో సారి గెలిచారు. తరువాత ఆయన ఎంపీ స్థానానికి పరిమితం అయ్యారు. వీరు మాత్రమే హ్యాట్రిక్ సాధించిన ఘనత దక్కించుకున్నారు.
హ్యాట్రిక్ దక్కని ఎమ్మెల్యే లు
కొడంగల్ నియోజకవర్గం లో ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గా వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. రేవంత్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని పరిణామం జరగడంతో రేవంత్ రెడ్డి షాక్ తిన్నారు. వనపర్తి నియోజకవర్గం లో చిన్నారెడ్డి, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, బాలకిష్టరెడ్డి, రెండు సార్లు గెలిచి మూడో సారి ఓటమి చెందిన జాబితాలో ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో గతంలో బీజేపీ అభ్యర్థిగా రావుల రవీంద్రనాథ్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొంది మూడో సారి ఓటమి చెందారు. ఈ జిల్లాలో హ్యాట్రిక్ సాధించడం కష్టమనే ధోరణి కనిపించడంతో ప్రస్తుతం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ సాధిస్తామా లేదా అనే కొంత గుబులు పడుతున్నారు.