టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిన జగ్గారెడ్డి..ఇక వచ్చే ఎన్నికల్లో నా బదులుగా నా భార్య పోటీ చేస్తుందంటూ ప్రకటించారు. అయితే తాజాగా జగ్గారెడ్డి మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ గతంలో తను చెప్పిన వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం రిజర్వేషన్ మహిళా, జనరల్ ఏది ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డినే అని స్పష్టం చేశారు. అదే సమయంలో అధిష్టానం ఆదేశిస్తే నేను వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీశ్ రావుపై పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో తాను పోటీ చేయబోవడం లేదని గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నేను సంగారెడ్డిలో మాత్రమే పోటీ చేయనన్నానని చెప్పానని… కానీ వేరే చోట పోటీ చేయను అనలేదు కదా అని కొత్త ట్విస్టు ఇచ్చారు. నేను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందంటూ పేర్కొన్నారు.
రాజకీయాల్లో పర్మినెంట్‍గా ఎవరూ తోపులు ఉండరన్నారు. పెద్ద పెద్ద తోపులను కూడా ప్రజలు ఎన్నికల్లో పక్కన పెట్టేసిన చరిత్రలు ఉన్నాయని, అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే తోపు కాదు సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ మాత్రమే తోపులన్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలలో కొందరి పనితీరు సరిగా లేదని సీఎం చెప్పారని, వారు పనితీరు మార్చుకోకపోతే, వచ్చే ఎన్నికల టికెట్ ఇవ్వాలో వద్దో సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయం తీసుకుంటారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
