మంతి కొండా సురేఖపై మంత్రి అడ్లూరి ఫైర్

కూతురు సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు కొండా సురేఖ నైతిక బాధ్యత వహించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూతురు సుస్మితాపటేల్ చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పడం అసంబద్ధం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. కొండా సురేఖ వైఖరిని ఖండిస్తూ మాట్లాడిన తొలి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ వార్తల్లో నిలిచారు.

కూతురు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ నైతిక బాధ్యత వహించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కుట్రలు జరుగుతున్నాయి అని అడ్లూరి ఆరోపించారు. అయినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో 2029లో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, 2029లోను రేవంత్ రెడ్డినే సీఎంగా కొనసాగుతారని అడ్లూరి లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

కొండా సురేఖపై క్రమశిక్షణా సంఘానికి ఎమ్మెల్యేల ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించాలని, పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుపై మల్లు రవి స్పందిస్తూ..మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Latest News