తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం

తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తేజస్వీ సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం

హైదరాబాద్ : , తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తేజస్వి సూర్య వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ నిరంతరం విషపూరిత వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డాపరు. యూపీఏ ప్రభుత్వం అనేక సంప్రదింపులు, ప్రజల దీర్ఘకాల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది కోట్లాది ప్రజల ఆకాంక్షల ప్రతిఫలం అని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా బీజేపీ ఎంపీ పార్లమెంట్‌లో మాట్లాడటం తీవ్రంగా ఖండించదగిన విషయం. బ్రిటిష్ ఇండియా విభజన కంటే ఆంధ్రా-తెలంగాణ విభజన దారుణమని చెప్పడం పూర్తిగా అసత్యం, చరిత్రను వక్రీకరించడమేనని మండిపడ్డారు.

డెలిమిటేషన్ వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అంశంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాంటి కీలక విషయంపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్నప్పుడు, అనవసరంగా తెలంగాణపై వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. సమయం దొరికినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మే ప్రయత్నం చేయడం దుర్మార్గం అని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజాకవి గద్దర్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని, తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన గద్దర్ ని అవమానించేలా మాట్లాడటం అభ్యంతరకరం అన్నారు.

తెలంగాణ అంటే బీజేపీకి ఎప్పటినుంచో వివక్ష భావమే కనిపిస్తోందని, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలంగాణపై చిన్న చూపు వ్యాఖ్యలు చేయడం ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అదే విధంగా ఉన్నాయని, బీజేపీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే ఎవరైనా, ఏ పార్టీ అయినా తెలంగాణ ప్రజలు సహించరు. వెంటనే బీజేపీ ఎంపీ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పి తమ వైఖరిని సరిదిద్దుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం మూర్ఖత్వం: ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్
దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ