CM Revanth Reddy | ఎర్ర జెండాలతోనే సమస్యలకు పరిష్కారం

కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారని, ఉప్పు లేని వంట రుచి ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కనిపించినప్పుడే ఆ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అధికారంలోకి తీసుకురాకపోయినా అధికారంలో ఉన్నవారిని దింపగల శక్తి కమ్యూనిస్టులకు ఉందని అన్నారు.

CM Revanth Reddy | ఎర్ర జెండాలతోనే సమస్యలకు పరిష్కారం

CM Revanth Reddy | కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారని, ఉప్పు లేని వంట రుచి ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కనిపించినప్పుడే ఆ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. అధికారంలోకి తీసుకురాకపోయినా అధికారంలో ఉన్నవారిని దింపగల శక్తి కమ్యూనిస్టులకు ఉందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “నవ తెలంగాణ” దినపత్రిక 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పని చేస్తే ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి అభిలషించారు. ఆనాడైనా.. ఈ నాడైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉందని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్- కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ప్రజల పత్రిక నవ తెలంగాణ

నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని, అందులో నవ తెలంగాణ పత్రిక ఒకటి అని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రస్తుతం పత్రికా సంస్థలు తమ విశ్వసనీయతని కోల్పోయే పరిస్థితి తలెత్తుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పత్రికలు ఉపయోగపడిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నాటి సాయుధ రైతాంగ పోరాటంలో, సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికలు ఉపయోగపడ్డాయని చెప్పారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. పాలకులు ఎవరైనా ప్రజల పక్షం నిలుస్తున్న పత్రిక నవ తెలంగాణ అని ప్రశంసించారు. ప్రభుత్వ ప్రకటనల్లో నవ తెలంగాణకు సమాన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

వింత పోకడలతో రాజకీయ పార్టీల పత్రికలు

గతంలో తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలను నడిపేవని, కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడతో వ్యవహరిస్తున్నాయని సీఎం రేవంత్‌ విమర్శించారు. తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పనిచేస్తున్నాయన్నారు. దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోందని విచారం వ్యక్తం చేశారు. జర్నలిజం ముసుగులో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాలని కోరారు. జర్నలిజంలో ఓనమాలు తెలియనివారు కొంతమంది జర్నలిస్టు ముసుగు వేసుకుని సోషల్ మీడియా పేరుతో తిరుగుతున్నారని అన్నారు. నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్ట్ పదానికి డెఫినేషన్ నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తాము గతంలో ప్రెస్‌మీట్లు నిర్వహించినప్పుడు సబ్జెక్టుపై జర్నలిస్టులతో వివరాలు తీసుకునే వాళ్లమని తెలిపారు. కానీ ఇవాళ వింత పోకడలు వచ్చాయని, వాటికి రాజకీయ పార్టీలు తోడయ్యాయని అన్నారు. ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని చెప్పారు. రాజకీయ నాయకుల విశ్వసనీయతలాగే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నిజమైన జర్నలిస్టులు దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నిజమైన జర్నలిస్టులు, జర్నలిస్టుల ముసుగు తొడుక్కున్న వారిని మీరే వేరు చేయాల్సిన అవసరం ఉందని లేదంటే దేశ భద్రతకే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

నిబద్ధతతో సాగుతున్న నవ తెలంగాణ

నిజాన్ని నిర్భ‌యంగా రాసే పత్రిక న‌వ తెలంగాణ అని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర‌సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ‌ల మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఎన్నో ఇబ్బందులున్నా ఒక నిబ‌ద్ద‌త‌తో ముందుకు సాగుతున్నదని చెప్పారు. క‌మ్యూనిస్టు సోద‌రులు పేద‌ల ప‌క్షాన నిలిచి ప్ర‌భుత్వం చేసే త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తుంటారని, పేద‌ల‌కు అండ‌గా నిలుస్తుంటారని అన్నారు. వారి పోరాటాల‌లో నిజాయితీని గుర్తించి ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం పేద‌ల‌కు క‌నీస అవ‌స‌రాలైన కూడు, గూడు, గుడ్డ విష‌యంలో ప‌నిచేస్తోందని తెలిపారు. ‘మీరు మ‌మ్మ‌ల్ని పొగ‌డ‌వద్దు. నిజాన్ని నిర్భ‌యంగా రాసే ప్ర‌క్రియ కొన‌సాగించండి. మేం చేసే త‌ప్పుల‌ను ప‌త్రికా ప‌రంగా మా దృష్టికీ తీసుకురండి. ప్ర‌భుత్వ ప‌రంగా న‌వ తెలంగాణ‌కు మా సంపూర్ణ స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవ తెలంగాణ సిబ్బంది, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.