రేవంత్ ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి పోచారం ఫైర్ !

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధుల మంజూరు కోసం మంత్రికి 20సార్లు చెప్పిన స్పందన లేదని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారు అని, ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఫోన్లను మంత్రులు తీయరు అని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధుల మంజూరు విషయంలో జరుగుతున్న జాప్యం ఆయన అసహనానికి కారణమైంది. సిద్దాపూర్ రిజర్వాయర్ కోసం నిధుల మంజూరు కోరుతూ మంత్రికి, సీఎంకు  20సార్లు చెప్పానని,
నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్లు మొక్కలా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారు అని, ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఫోన్లను అధికారులు, మంత్రులు తీయరు అని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హాయంలో జీవోలు వేగంగా జారీ, అమలు జరిగిపోయేవని గుర్తు చేశారు. నేను కూడా 20 ఏళ్లు మంత్రిగా పనిచేశానని,  నాలాంటి వాళ్ల ఫోన్లు కూడా ఎత్తకపోతే ఇంకా ఈ రాజకీయాలు ఎందుకు అని అసహనం వ్యక్తం చేశారు. నేను ఏమైనా త‌మాషా కోసంఫోన్లు చేస్తున్నామా? అని ప్రశ్నించారు. చేసిన పనులకు కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు.  ఇరిగేషన్ అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ పోచారం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వివరణ

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ బి. మహేష్ గౌడ్ స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పోచారం అర్థం చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పాలకులు లక్షల కోట్ల అప్పుచేసి వెళ్లారని, ప్రతినెలా 7వేల కోట్ల వాయిదాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నిధుల విడుదల ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు.

సర్కార్ పై ఎమ్మెల్యేల అసమ్మతి గళం

మాజీ మంత్రి , మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి ఆహ్వానంతో జూన్ 2024లో పోచారం తన కుమారుడు భాస్కర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆయన పార్టీ ఫిరాయింపు కేసును కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో మంత్రులు నియోజకవర్గాల్లోనే అభివృద్ది పనులకు నిధులు మంజూరు అవుతున్నాయని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మంత్రులు నిధులు ఇవ్వడంలేదు వ్యాఖ్యానించారు. తాజాగా పోచారం సైతం అదే తరహా విమర్శలు చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి సైతం ప్రభుత్వ పనితీరుపై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన విమర్శలు పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసమ్మతికి నిదర్శనంగా కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తుంది.

 

ఇవి కూడా చదవండి :

తెలంగాణలోని సర్కారు బ‌డి విద్యార్థులకు గుడ్ న్యూస్!
రేవంత్ ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి పోచారం ఫైర్ !

Latest News