Sheep Distribution Scam Case | ఈడీ : గొర్రెల పంపిణీ స్కామ్ రూ.1000కోట్ల పైనే
గొర్రెల పంపిణీ పథకం కింద రూ.1000 కోట్ల మోసమన్న ఆరోపణలతో ఈడీ సోదాలు.. మాజీ మంత్రి ఓఎస్డీ ఇంట్లో బ్యాంక్ పాసుబుక్స్, ఫేక్ అకౌంట్లు, డివైజులు స్వాధీనం.

Sheep Distribution Scam Case | విధాత, హైదరాబాద్ : గొర్రెల పంపిణీ పథకం అక్రమాల విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని ఈడీ పేర్కొంది.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. ఈ బ్యాంకు ఖాతాలు ఆన్ లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ లోనూ ఉపయోగించినట్లు పేర్కొన్నారు. సోదాల అనంతరం 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. అదే విధంగా 200కు పైగా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని వివరించింది. గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో కేవలం 7 జిల్లాల్లోనే రూ. 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉందని..కానీ 33 జిల్లాలు కలిపి చూస్తే రూ. వెయ్యి కోట్లకు పైనే అక్రమాలు జరిగాయని ఈడీ తెలిపింది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఈడీ పేర్కొంది.
గొర్రెల పంపిణీ స్కీం లో లబ్ధిదారులు అసలు గొర్రెల వ్యాపారంతో సంబంధం లేనివారు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని.. కానీ వెయ్యి కోట్ల రూపాయలు మాయం చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ విక్రేతలు, ఫేక్ బిల్లులను మళ్లీ మళ్లీ పేర్కొంటూ డబ్బులు దోచుకున్నట్టు ఆధారాలు గుర్తించారు. ఈడీ సోదాల్లో ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు కిక్‌బ్యాక్ లకు సంబంధించిన డాక్యుమెంట్లు, నకిలీ చెక్ బుక్‌లు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
డాక్యుమెంట్లలోని సమాచారంతో ప్రశ్నలు
పశుసంవర్ధక శాఖ, గొర్రెలు, మేకల డెవలప్మెంట్ ఫెడరేషన్ లో సీజ్ చేసిన గొర్రెల పంపిణీ స్కీమ్ రికార్డులు, బ్యాంకు స్టేట్మెంట్ ల ఆధారంగా ఈడీ విచారణలో నిందితులను ప్రశ్నిస్తుంది. గొర్రె పిల్లల కొనుగోలు, తరలింపు, లబ్ధిదారులకు అప్పగింత, నిధుల బదలాయింపు వరకు ఆర్థిక శాఖ మంజూరు చేసిన నిధులకు సంబంధించిన రికార్డులు కీలకంగా మారాయి. నిధుల దారి మళ్లింపుకు సూత్రధారులైన కల్యాణ్ సహా మరో ఇద్దరిని అరెస్టు చేసేందుకు ఈడీ సిద్ధమవుతుంది.
గొర్రెల పంపిణీ పేరిట రూ.2.01 కోట్ల మేర నిధులను పక్కదారి పట్టించినట్లు తొలుత గచ్చిబౌలి పోలీసులకు గతేడాది వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనంతరం కేసును ఏసీబీ దర్యాప్తు చేసింది. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్‌నాయక్, కల్యాణ్‌కుమార్ సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేసింది. ఈ జాబితాలో పలువురు పశుసంవర్ధకశాఖ అధికారులున్నారు. దళారులుగా వ్యవహరించిన మొయిదుద్దీన్, ఇక్రముద్దీన్ విదేశాలకు పారిపోయారు. ఈ కేసు ఆధారంగా ఈడీ గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసింది.