తెలంగాణ లోక్‌సభ ఎన్నికల విజేతలు వీరే

అత్యధిక మెజార్టీతో గెలిచిన నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి అత్యల్ప మెజార్టీతో గట్టెక్కిన మహబూబ్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి అరుణ

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల విజేతలు వీరే

విధాత : తెలంగాణలోని 17లోక్‌ సభ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 8, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆరెస్‌ ఒక్క స్థానం కూడా గెలుపొందలేకపోయింది. గెలిచిన వారిలో నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 5లక్షల 59,906ఓట్లతో గెలుపొందారు. సైదిరెడ్డికి 2,24,431ఓట్లు రాగా, మూడో స్థానంలో ఉన్న బీఆరెస్‌ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి 2,18,417ఓట్లు పోలయ్యాయి. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తన బీఆరెస్‌ ప్రత్యర్థి నామా నాగేశ్వరరావుపై 4.67లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై ఆయన 3.8 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తన సమీప బీఆరెస్‌ అభ్యర్థి మాలోతు కవితపై 3.44లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

కరీంనగర్ లోక్‌సభ స్థానంలో సిటింగ్‌ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కాంగ్రెస్ అభ్యర్థి వేల్పాల రాజేందర్ రావుపై 2.2లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌పై రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్‌పై 2లక్షల 29,170 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌పై 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్‌లో సిటింగ్‌ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్‌ అభ్యర్థి టి. జీవన్ రెడ్డిపై లక్ష ఓట్లకు పైగా మెజార్టీ సాధించారు. హైదరాబాద్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ 3.25 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఒవైసీకి 6.5లక్షలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మాధవీలతకు 3.20లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థికి 62వేలు, బీఆరెస్‌ అభ్యర్థికి 18వేలు చొప్పున ఓట్లు పోలయ్యాయి. నాగర్‌ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటిపై 94వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఇక్కడ బీఆరెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు 3.2లక్షల ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి నగేష్ కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణపై 84వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ బీజేపీ అభ్యర్థి బీబీ. పాటిల్‌పై 47వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. సికింద్రాబాద్‌లో సిటింగ్‌ ఎంపీ, బీజేపీ అభ్యర్థి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై 50వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 35వేల పైచీలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై 3600 పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై దాదాపు 1.72లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.