ఢిల్లీలో మేఘారెడ్డి..గాంధీ భవన్ లో చిన్నారెడ్డి!

వనపర్తి టికెట్‌పై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలతో కాంగ్రెస్‌లో వివాదం ముదిరింది. మేఘారెడ్డి ఢిల్లీలో అధిష్ఠానానికి ఫిర్యాదు చేయగా.. చిన్నారెడ్డి గాంధీభవన్‌లో వివరణ ఇచ్చారు.

Reported by: Tejaswini Nanna | రాజకీయాలు | Aug 22, 2026, 3:19 pm IST
Read Time: 4 mins
ఢిల్లీలో మేఘారెడ్డి..గాంధీ భవన్ లో చిన్నారెడ్డి!

కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ ను గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తూడి మేఘారెడ్డికి ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు పార్టీలో దూమారం రేపుతున్నాయి. చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై సీరియస్ అయిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లి నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ రోజు ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నించారు.

మరోవైపు తను చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం జారీ చేసిన వాట్సాప్ నోటీసులపై చిన్నారెడ్డి స్పందించారు. శనివారం స్వయంగా గాంధీభవన్‌కు వచ్చి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యల మీద క్రమశిక్షణ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్యామ్‌మోహన్‌కు వివరణ ఇచ్చారు.

నిన్న ‌‌ చిన్నారెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌‌‌‌ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ ఆయన అనుచరులు గాంధీభవన్‌‌‌‌ ఎదుట ధర్నా చేశారు. వనపర్తి నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి చిన్నారెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ‘వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌ను కాపాడాలి’, ‘చిన్నారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు.