దూసుకువస్తున్న ‘ఏజెంటిక్‌ ఏఐ’.. టాస్క్‌ ఇస్తే.. పని పూర్తి చేసే ఏఐ

ఇప్పటికే ప్రతి రంగంలో ఏఐ రంగ ప్రవేశం చేస్తున్నది. అదే సమయంలో ఒక దానిని మించిన స్థాయిలో ఏఐ సాంకేతికతలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఏజెంటిక్‌ ఏఐ అనేది రిటైల్‌ రంగంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. టాస్క్‌ ఇస్తే.. అన్నీ తానై వ్యవహరించి.. పని పూర్తి చేసేస్తుంది.. ఏజెంటిక్‌ ఏఐ.

ఏఐ.. ఇప్పుడు ప్రపంచాన్ని శాశిస్తున్న అధునాతన పరిజ్ఞానం! అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కీలక మార్పు దశలోకి తీసుకుపోతున్నది. ఇప్పటి వరకూ ప్రధానంగా జనరేటివ్‌ ఏఐ… అంటే.. కంటెంట్‌ తయారీ ఏఐ గురించే ప్రపంచం ఎక్కువగా మాట్లాడుకున్నది. ఇప్పుడు దాని స్థానంలో ఏజెంటిక్‌ ఏఐ క్రమంగా వేళ్లూనుకుంటున్నది. పేరులోనే దాని అర్థం ఏంటో అర్థమైపోతున్నది. మనం ఒక పనికి ఏజెంట్లను పెట్టుకున్నట్టన్నమాట. ఈ ఏజెంటిక్‌ ఏఐ కంటెంట్‌ తయారీ, మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, కోడ్‌ తయారు చేయడం వంటి పనులు చేసే టెక్నాలజీ కాదు. దాని లక్ష్యాన్ని అర్థం చేసుకుని, దానిని పూర్తి చేయడానికి ఎలాంటి ప్రణాళిక అవసరమో దాని స్వయంగా రూపొందించుకొని, అవసరమైన నిర్ణయాలు తానే తీసుకుని, చర్యలు చేపట్టి పని పూర్తి చేసే వ్యవస్థ ఇది. అంటే పూర్తి స్వయం ప్రతిపత్తితో వ్యవహరిస్తుందన్నమాట.

ప్రణాళిక దానిదే.. నిర్ణయాలు దానివే

సింపుల్‌గా చెప్పాలంటే.. టాస్క్‌ ఇస్తే.. దానిని ఎలా పూర్తి చేయాలో చెప్పడం కాదు.. ఎలా చేయాలో ప్రణాళిక వేసుకుని, ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చూసుకుని, పనిని పూర్తి చేస్తుంది. అంటే.. ఇప్పటి వరకూ ఉన్న జనరేటివ్‌ కృత్రిమ మేధ వ్యవస్థలు.. మనుషులకు సహాయకుల పాత్ర పోషించాయి. అంటే.. ఈమెయిల్‌ రాయడం, డాటా విశ్లేషించడం, కోడ్‌ తయారీకి సూచనలు చేయడం వంటివన్నమాట. వీటిని ‘AI Copilots’ అని పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఏజెంటిక్‌ ఏఐ మాత్రం.. అక్కడితో ఆగదు. మనం ఒక లక్ష్యాన్ని సెట్‌ చేస్తే.. ఏజెంటిక్‌ ఏఐ దానిని చిన్న చిన్న దశలుగా విభజించుకుంటుంది. అవసరమైన సమాచారాన్ని సేకరించుకుంటుంది. అవసరమైతే ఇతర ఏఐ వ్యవస్థలతో మాట్లాడుకుంటుంది. చివరికి మొత్తం పని పూర్తి చేసి ఇస్తుంది.

ఇంకా సులభంగా చెప్పాలంటే.. మీరు కనుక ఒక బియ్యం వ్యాపారి అనుకుందాం. సరైన ధరలో ముడిసరుకు కొనుగోలు చేసి, సప్లై చైన్‌ నిర్వహించు.. అని ఏజెంటిక్‌ ఏఐకి ప్రాంప్ట్‌ ఇస్తే.. ఇక చూడండి.. అదే సరఫరాదారులతో చర్చలు చేస్తుంది. తగిన రేట్లు వచ్చేలా సంప్రదింపులు చేస్తుంది. రవాణా, సరుకు నిల్వ వంటివి స్వయంగా నిర్వహించుకుంటుంది.

ఇప్పటికే మార్కెట్లలో విప్లవం..

ఏఐ ఆధారిత డిజిటల్‌ షాపింగ్‌ వ్యవస్థలు.. ఇప్పటికే గణనీయంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. 2025 బ్లాక్‌ ఫ్రైడే సీజన్‌లో అమెరికాలోని రిటైల్‌ వెబ్‌సైట్‌లకు ఏఐ ఆధారిత ట్రాఫిక్‌ ఏకంగా 805 శాతం పెరిగిందని అడోబీ డాటా చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. 22 బిలియన్‌ డాలర్లకుపైగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఏఐ ఏజెంట్లు కారణమని అంచనా వేస్తున్నారు. 2024లో 5.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఏఐ ఏజెంట్ల మార్కెట్‌ 2034 నాటికి 236 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (World Economic Forum) నివేదిక అంచనా వేసింది.

ఉద్యోగాలపైనా పెను ప్రభావం…

ఏజెంటిక్‌ ఏఐ వల్ల ఉద్యోగాల రంగంపై గణనీయంగా కనిపిస్తున్నది. ప్రత్యేకించి ఎంట్రీలెవల్‌ ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రభావితం అవుతున్నాయి. ఈ స్థాయిలో ఉద్యోగులు… డాటా ఎంట్రీ, ప్రాథమిక కోడింగ్‌, షెడ్యూలింగ్‌, రిపోర్ట్‌ తయారీ, డాక్యుమెంటేషన్‌ వంటి పనులు చేస్తుంటారు. అయితే.. వీటిని ఏఐ నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నది. దీంతో కంపెనీలు కూడా ఉద్యోగార్థుల్లో కేవలం డిగ్రీలు మాత్రమే చూడటం కాకుండా.. ఏఐ నైపుణ్యాలు, ఏఐ ఏజెంట్లను కంట్రోల్‌ చేసే నైపుణ్యాలు, సమస్యలను విశ్లేషించే సామర్థ్యాలు, నిర్ణయాలు తీసుకునే తీరు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అంటే.. డిగ్రీల కంటే.. స్కిల్స్‌ ముఖ్యమన్నమాట. సరికొత్త ప్రపంచంలో పాత కాలేజీ బ్రాండ్‌ లేదా మనం సాధించే సగటు మార్కులు ఎందుకూ పనికిరావు. ఏఐ, మషీన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డాటా ఎనలటిక్స్‌ వంటి నైపుణ్యాలు కలిగినవారికే ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తున్నాయి. రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థలు కూడా ఇంటర్వ్యూల ద్వారా కాకుండా.. సిమ్యులేషన్‌ బేస్డ్‌ టెస్టింగ్‌ ద్వారా అభ్యర్థులను పరీక్షిస్తున్నారు. అంటే.. ఒక ఏఐ టీమ్‌ను ఎలా నిర్వహిస్తారు? క్లిష్టమైన సమస్యలను ఏఐ సహకారంతో ఎలా పరిష్కరిస్తారు? అనే అంశాలను గమనిస్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో నైపుణ్యాలే అన్నింటిలో కీలకమని ఏఐ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఏఐ ఎంత శక్తిమంతమైనది అయినప్పటికీ.. కీలక నిర్ణయాల్లో మనిషి పాత్ర తప్పనిసరిగా అవసరం. దీనినే ‘Human-in-the-Loop (HITL)’ అని పిలుస్తున్నారు. అంటే.. కోర్టు తీర్పు, వైద్యం లేదా చికిత్స నిర్ధారణ, ఉద్యోగస్తుల తొలగింపు, లోన్‌లకు ఆమోదం తెలుపడం వంటి విషయాల్లో ఏఐ సూచనలు ఇవ్వవచ్చు. కానీ.. తుది ఆమోదం మాత్రం మనిషే ఇవ్వాల్సి ఉంటుంది.

ఏఐ యుగంలో అనేక సమస్యలు కూడా పొంచి ఉంటాయి. ఇప్పటికే ఏఐ ఆధారితంగా ఉద్యోగాల తొలగింపులో ఎందుకు తీసేశారో తెలియకుండా పోతున్నది. ఇది కార్మిక హక్కుల ఉల్లంఘనకు కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం లేకపోతే.. మరి ఆ ఉద్యోగాలు కోల్పోయినవారి పరిస్థితి ఏంటి? అనేది కూడా చర్చనీయాంశం అవుతున్నది. ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నా.. పరిమిత సంఖ్యలోనే ఉంటాయన్న వాదనలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇది ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే ఆందోళనలు కూడా రేకెత్తుతున్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు సమీప భవిష్యత్తుకు చేరుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also |

Artificial intelligence | ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సంప‌న్నుల చేతుల్లో ఆయుధం..!
Artificial Intelligence | ఏఐతో ఆ మూడు ప్రొఫెషన్స్‌కు ఎలాంటి భయం లేదు! బిల్ గేట్స్ గుడ్ న్యూస్‌

Latest News