VI 5G SIM Upgrade | సిమ్ మార్చకుండానే.. 5G లోకి అప్‌గ్రేడ్.. కానీ ఈ 3 షరతులు తప్పనిసరి!

5G SIM Upgrade | తమ కస్టమర్లు 5జీ సేవలు అందుకునే మార్గాన్ని వొడాఫోన్ ఐడియా సులభతరం చేసింది. ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ సిమ్‌‌ను మార్చుకోకుండానే 5Gకి అప్‌గ్రేడ్ అయ్యే వెసులుబాటు కల్పించింది. అయితే మూడు షరతులకు మాత్రం లోబడి ఉంటేనే 5జీ సేవలను పొందవచ్చని తెలిపింది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Mar 28, 2026, 9:37 pm IST
Read Time: 4 mins
VI 5G SIM Upgrade | సిమ్ మార్చకుండానే.. 5G లోకి అప్‌గ్రేడ్.. కానీ ఈ 3 షరతులు తప్పనిసరి!

VI 5G SIM Upgrade | దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా (VI) తమ కస్టమర్లకు మెరుగైన 5జీ సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 4జీ సిమ్ ఉపయోగిస్తున్న కస్టమర్లు 5జీ సేవలను పొందే మార్గాన్ని చాలా సులభతరం చేసింది. తమ మొబైల్‌లో ఉన్న సిమ్‌‌ను మార్చుకోకుండానే 5జీ సేవలకు అప్‌గ్రేడ్ అయ్యే వెసులుబాటు తీసుకొచ్చింది.

5జీ సేవల్లో ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో ముందంజలో ఉండగా.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా ఆ బాటలోనే వెళ్తుంది. వినియోగదారులు స్టోర్‌‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సిమ్ అప్‌గ్రేడ్ చేసుకోకుండానే 5జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. అయితే 5జీ సేవలు పొందడానికి మాత్రం కొన్ని షరతులు వర్తిస్తాయని వొడాఫోన్ ఐడియా తెలిపింది.

షరతులు ఏంటంటే..

* కస్టమర్ల వద్ద 5జీ సపోర్ట్ కలిగిన స్మార్ట్‌‌ఫోన్ ఉండాలి.
* రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్ యాక్టివ్‌లో ఉండాలి. (సర్కిల్‌ను బట్టి ఇది మారుతుంది.)
* కస్టమర్లు ఉండే ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్ ఉండాలి.

ఈ మూడు షరతులకు లోబడి ఉంటే.. మీ ఫోన్ ఆటోమేటిక్‌గా 5జీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. అయితే ముందుగా మీ ఫోన్‌లో 5జీ సపోర్టు ఉందో చూసుకోవడంతో పాటు.. నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో 5జీ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతంలోకి వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా 5జీ కనెక్ట్ అవుతుంది.

ఆటోమేటిక్‌గా 4G – 5G స్విచ్చింగ్ !

5G, 4G నెట్‌వర్క్‌ల మధ్య స్విచ్చింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం ఉండదని వొడాఫోన్ ఐడియా తెలిపింది. మూడు షరతులకు లోబడి ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా 5జీ కనెక్ట్ అవుతుందని.. ఒకవేళ 5జీ సిగ్నల్ పరిధి దాటితే 4జీ నెట్‌వర్క్‌లోకి ఆటోమేటిగ్గా మారుతుందని పేర్కొంది. దీంతో కనెక్టివిటీలో అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.

5జీ సేవలు ఎక్కడ ఉన్నాయి?

ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ముంబై నగరంలో 5G సేవలను ప్రారంభించింది. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా పూర్తి 5జీ విస్తరణకు సంబంధించిన టైమ్‌లైన్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Read More:

7000mAh బ్యాటరీ, 200మెగాపిక్సెల్ కెమెరాతో వివో మొబైల్.. లాంచ్ ఎప్పుడంటే..!

ఆరేళ్ల ఓఎస్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో.. శాంసంగ్ A సిరీస్‌లో రెండు మిడ్ రేంజ్ ఫోన్లు.. !