Asia Cup 2025 | ఆసియాకప్ 2024: సూపర్ 4లో సూపర్ ఓవర్ – లంకపై భారత్ విజయం
దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ సూపర్ 4 ఆఖరి మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా భారత్ శ్రీలంకపై విజయం సాధించింది. ఫైనల్ ఆదివారం భారత, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగనుంది.

Asia Cup 2025 | ఎటువంటి సంచలనాలు లేకుండా సాగిపోతున్న అసియాకప్ పోటీలకు నామమాత్రమైన ఆఖరి సూపర్ 4 మ్యాచ్ మాత్రం సూపర్ ఝలక్ ఇచ్చింది. భారీ స్కోర్ల మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. భారత్ ధాటిగా ఆడి టోర్నమెంట్‌లోనే అత్యధిక స్కోరు(202) నమోదు చేసినా, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక పోయేదేముందన్నట్లు ఆడి సంచలనంగా అంతే స్కోరు సాధించి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లింది. భారత్ విధించిన 202 పరుగుల స్కోరును అదే 5 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో సూపర్ ఓవర్‌కు చేరుకున్నమ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 6 బంతులకు గాను 5 బంతులకే 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. అందులో ఒకటి వైడ్ కాగా, ఒకటే అధికారిక పరుగు. అనంతరం భారత్ మొదటి బంతికే 3 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ గెలుపు రెండు జట్లకు ఎటువంటి లాభం చేకూర్చకపోయినా, ప్రాక్టీస్ మాత్రం బ్రహ్మాండంగా అయింది.
టాస్ గెలిచి ఇండియాను బ్యాటింగ్‌కు దించిన లంకేయులు, భారత బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. మళ్లీ శివాలెత్తిన అభిషేక్ శర్మ వరుసగా మూడో అర్థశతకం సాధించగా, మిగిలినవారందరూ తలో చేయి వేయడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ 61(31 బంతులు, 2 సిక్స్‌లు, 8 ఫోర్లు), తిలక్49 నాటౌట్(34 బంతులు, 1 సిక్స్, 4 ఫోర్లు), సంజూ39 (23 బంతులు, 3 సిక్స్‌లు, 1 ఫోర్) పరుగులు చేయగా, ఆఖర్లో అక్షర్21(15 బంతులు, 1 సిక్స్, 1 ఫోర్) చేసి భారీ స్కోరుకు బాటలు వేసారు. బోర్డు మీద 200 దాటిన స్కోరు చూసి భారత అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
అనంతరం, లక్ష్యసాధనకు దిగిన లంకేయులు ఊహించని విధంగా ఇండియాకు షాక్‌ల మీద షాక్‌లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓపెనర్ నిశాంక 107(58 బంతులు, 6 సిక్స్‌లు, 7 ఫోర్లు), వన్ డౌన్ కుశాల్ పెరీరా 58(32 బంతులు, 1 సిక్స్, 8 ఫోర్లు) పరుగులతో వీర విధ్వంసం సృష్టించారు. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ 7 పరుగలప్పుడు డకౌట్ కావడంతో భారత అభిమానులు ఇక మొదలైంది అనుకుంటూ ఎంజాయ్ చేసారు కానీ, ఆ తర్వాతే అసలు వినాశనం మొదలైంది. రెండో వికెట్‌కు ఏకంగా 127 పరుగులు జోడించిన ఈ జంట, ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ, ఏ బౌలర్‌నూ వదిలిపెట్టలేదు. మొత్తం భారత జట్టు, ప్రేక్షక జనం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. మెల్లగా వికెట్ల పతనం మొదలైనా ఓపెనర్ నిశాంక మాత్రం చిచ్చరపిడుగులా చెలరేగి ఈ కప్‌లో మొదటి సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. చివరికి 107 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిశాంక విధ్వంసం ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 20 ఓవర్లకు సరిగ్గా 202 పరుగులు చేసింది.
ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.