Modi – Naqvi X war | ఆసియా కప్ వివాదం: మోదీ ట్వీట్‌కు నఖ్వీ అసత్యాల కౌంటర్
ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించినా ట్రోఫీ వివాదం చెలరేగింది. మోదీ ట్వీట్‌పై పాక్ చీఫ్ నఖ్వీ అబద్ధాల కౌంటర్‌తో అభాసుపాలు. వివరాలు ఇక్కడ.

Asia Cup Controversy: Mohsin Naqvi Hits Back with lies at PM Modi’s Operation Sindoor Tweet
క్రికెట్ పోరు.. మైదానం నుండి ట్విట్టర్‌కు
దుబాయ్/న్యూఢిల్లీ:
Modi – Naqvi X war | ఓ వైపు ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఘనవిజయం సాధించి ఆనందోత్సాహలు జరుపుకుంటుంటే, ఓటమిని ఓర్చుకోలనే పాకిస్తాన్ ట్రోఫీ వివాదాన్ని ముందుకు తెచ్చింది. భారత జట్టు పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో ట్రోఫీ బహుకరణోత్సవం ఆగిపోగా, నఖ్వీ ఆగ్రహంతో స్టేజి వదిలి వెళ్లిపోయారు. ట్రోఫీని, ఆటగాళ్ల మెడళ్లను కూడా తనతో తీసుకెళ్లిన ఘటనపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అనంతరం రాజకీయ స్థాయికి చేరిన వివాదం ఇప్పుడు ట్విట్టర్‌లోనూ హీటెక్కింది.
మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, “#OperationSindoor on the games field. Outcome is the same – India wins! Congratulations to our cricketers” అంటూ పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన ఘనవిజయాన్ని గుర్తు చేస్తూ మోదీ చేసిన ఈ వ్యాఖ్య అభిమానులను ఉత్సాహపరిచింది. ఆయన ట్వీట్‌లో పాకిస్థాన్‌పై వ్యంగ్యం స్పష్టంగా కనిపించింది. మోదీ ట్వీట్‌కు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు కూడా స్పందించి, భారత్ విజయం గురించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
“యుద్ధాన్ని క్రికెట్‌లోకి లాగొద్దు” – నఖ్వీ విమర్శ
అయితే, మోదీ వ్యాఖ్యలపై నఖ్వీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో ఆయన ఇలా రాశారు:
“If war was your measure of pride, history already records your humiliating defeats at Pakistan’s hands. No cricket match can rewrite the truth. Dragging war into sports only exposes your desperation and disgraces the very spirit of the game.”
నఖ్వీ తన ట్వీట్‌లో, “యుద్ధం గర్వానికి కొలమానం కాదు. భారత్ పాకిస్థాన్ చేతుల్లో అనేక సార్లు అవమానకర పరాజయాలు ఎదుర్కొంది. అవి చరిత్రలో రికార్డు అయ్యాయి. క్రికెట్‌లో యుద్ధాన్ని లాగొద్దు” అని అసత్యాలతో తీవ్రంగా స్పందించారు. నిజానికి పాకిస్తాన్ 1947, 1965, 1971, కార్గిల్ యుద్ధాలలో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అయినా నఖ్వీ మేమే గెలిచామని ప్రగల్భాలు పలికాడు. ఈ వ్యాఖ్యలతో భారత్–పాక్ మధ్య మాటల యుద్ధం మరో స్థాయికి చేరింది.
ఇక బీసీసీఐ మాత్రం ట్రోఫీ వివాదంపై తీవ్రంగా స్పందించింది. “నఖ్వీ ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. నవంబర్‌లో జరగనున్న ICC సమావేశంలో ఈ విషయం మీద తీవ్ర నిరసన తెలుపుతాం” అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటించారు. మరోవైపు పాక్ మీడియా మాత్రం భారత్ ప్రవర్తనను తప్పుపట్టుతూ “క్రీడలో రాజకీయాన్ని కలిపింది భారత జట్టే” అని విమర్శిస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో ఈ వివాదం పెద్ద చర్చగా మారింది. AP, Reuters, Dawn వంటి మీడియా పత్రికలు ఈ అంశాన్ని ఫ్రంట్‌పేజీగా ప్రచురించాయి. క్రికెట్ మైదానంలో సాధారణంగా జరగాల్సిన విజయోత్సవం ఇప్పుడు రాజకీయ వాగ్వాదానికి వేదిక కావడం విశేషంగా మారింది.