IND vs PAK | ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం
ఆసియా కప్‌లో జరుగుతున్న టి20 మ్యాచ్‌లో భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగా, లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో సాధించింది.

విధాత స్పోర్ట్స్ డెస్క్:
IND vs PAK | దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ (Asia Cup 2025)లో భాగంగా భారత్, పాకిస్థాన్ (Ind Vs Pak)ల మధ్య జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్ విధించిన నామమాత్రపు లక్ష్యమైన 128 పరుగులను భారత్ 15.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ (40) టాప్ స్కోరర్. అఫ్రిది (33*), ఫకర్ జమాన్ (17), ఫహీమ్ అష్రఫ్ (11), ముఖీమ్ (10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, బుమ్రా రెండు చొప్పున, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
టీమ్‌ఇండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్ జట్టును బెంబేలెత్తించింది. మొదటి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా, తొలి బంతికే ఓపెనర్ అయూబ్‌ను గోల్డెన్ డక్‌గా డగౌట్‌కు చేర్చాడు. ఆ తర్వాత సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్‌లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. 8వ ఓవర్‌లో ఫకర్ జమాన్‌ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 13వ ఓవర్‌లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. చివర్లో షాహీన్ అఫ్రిది(16 బంతుల్లో 33, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
చిన్న లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు షరామామూలుగా అభిషేక్ (13 బంతుల్లో 31, 2 సిక్స్‌లు, 4 ఫోర్లు) బుల్లెట్ స్టార్ట్ ఇచ్చాడు. శుభమన్ తొందరగానే ఔటయినప్పటికీ, అభిషేక్‌తో జత కలిసిన కెప్టెన్ సూర్య ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కాసేపటికే అభిషేక్ అవుటవడంతో, క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ(31 బంతుల్లో 31) దూకుడుగా ఆడి గమ్యానికి దగ్గరలో పెవిలియన్ చేరాడు. కెప్టెన్‌తో జత కలిసిన దూబే(10*) ఇక వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో, సూర్య(47*) సిక్స్‌తో మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు.