Ashes Boxing Day Test : బాక్సింగ్ డే టెస్టులో హోరాహోరీ..ఒక్క రోజులోనే 20 వికెట్లు

బాక్సింగ్ డే టెస్టులో సంచలనం! మెల్‌బోర్న్‌లో ఒక్కరోజే 20 వికెట్లు పతనం. ఆసీస్ 152, ఇంగ్లాండ్ 110 పరుగులకే ఆలౌట్. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆధిక్యం 46 పరుగులు.

Ashes Boxing Day Test : బాక్సింగ్ డే టెస్టులో హోరాహోరీ..ఒక్క రోజులోనే 20 వికెట్లు

విధాత : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే నాలుగో టెస్ట్‌ మ్యాచ్ లో రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మైఖేల్‌ నెసర్‌ చేసిన 35పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు, అట్కిన్సన్ 2, స్టోక్స్, కార్స్ తలో వికెట్ సాధించి అసీస్ బ్యాటర్లను కట్టడి చేశారు.

అయితే అసీస్ ను స్వల్ప స్కోర్ కే అలౌట్ చేశామన్న ఆనందం ఇంగ్లాండ్‌ కు ఎంతో సేపు మిగల్లేదు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. దీంతో అసీస్ స్కోర్ కంటే 42 పరుగుల వెనకపడింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో
హరీ బ్రూక్ సాధించిన 41 రన్స్(34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా నిలిచింది. గస్‌ అట్కిన్సన్‌ (28 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. జో రూట్‌ (0), బెన్‌స్టోక్స్‌ (16), జెమ్మీ స్మిత్‌ సహా మిగతా వారంతా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్‌ బౌలర్లలో మైఖేల్‌ నెసర్‌ 4, స్కాట్‌ బోల్యాండ్‌ 3, మిచెల్‌ స్టార్క్‌ 2, కామెరూన్‌ గ్రీన్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఒక్క రోజులోనే 20 వికెట్లు పడటం గమనార్హం. ఇరు జట్లలో ఏ ఒక్క బ్యాటర్‌ కూడా కనీసం హాఫ్‌ సెంచరీ చేయలేకపోయారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌.. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక ఓవర్ మాత్రమే బ్యాటింగ్ చేయగా..వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (0*), స్కాట్‌ బోల్యాండ్‌ (4*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ను ఇప్పటికే ఆసీస్ 3-0తో కైవసం చేసుకుంది. వరుసగా మూడు టెస్టుల్లో ఓడి సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టుపై విమర్శలు వ్యక్తమవ్వడంతో ఈ టెస్టులో గెలుపు కోసం పోరాడే ప్రయత్నం చేస్తుంది. అయితే తొలి రోజు ఆటలో మాత్రం మరోసారి ఆసీస్ జట్టు పైచేయి సాధించింది.

ఇవి కూడా చదవండి :

Tollywood | 2025 క్రిస్మస్‌కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చిన్న చిన్న సినిమాల సందడి… ఏ మూవీకి ఎంత వసూళ్లు?
Papikondalu : పాపికొండల్లో పర్యాటకుల సందడి