Sachin Tendulkar | ఆయన అక్కడా మాస్టరే, ఇక్కడా మాస్టరే.. స్టాక్ మార్కెట్‌లో కోట్లు గడిస్తున్న సచిన్
Sachin Tendulkar | క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తాను క్రికెట్‌లో పరుగుల వరద పారించడంలోనే కాదు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులతో సంపద ఆర్జించడంలోనూ మాస్టర్‌నేనని నిరూపించుకున్నాడు. ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (Azad Engineering Ltd) అనే ఒక కొత్త కంపెనీ షేర్ల నుంచి కేవలం ఆరు నెలల్లోనే 15 రెట్లకుపైగా సంపదను ఆర్జించాడు.

Sachin Tendulkar : క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తాను క్రికెట్‌లో పరుగుల వరద పారించడంలోనే కాదు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులతో సంపద ఆర్జించడంలోనూ మాస్టర్‌నేనని నిరూపించుకున్నాడు. ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (Azad Engineering Ltd) అనే ఒక కొత్త కంపెనీ షేర్ల నుంచి కేవలం ఆరు నెలల్లోనే 15 రెట్లకుపైగా సంపదను ఆర్జించాడు.
ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి వచ్చి అతికొద్ది కాలమే అయ్యింది. గత ఏడాది డిసెంబర్ 20-22 తేదీల్లో 740 కోట్ల రూపాయల IPOను తీసుకొచ్చింది. ఒక్కో షేర్‌ను రూ.499 నుంచి రూ.524 రేటుకు మార్కెట్లో ఆఫర్ చేసింది. 28 షేర్‌లు ఒక లాట్ చొప్పున అమ్మింది. విజయవంతమైన ఇన్వెస్టర్లకు డిసెంబర్ 26న కంపెనీ షేర్‌లు అలాట్ అయ్యాయి. అదే నెల 28న బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) లో, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE) లో ఈ కంపెనీ షేర్‌లు లిస్టయ్యాయి. 37 శాతం ప్రీమియంతో రూ.720 వద్ద లిస్టింగ్ జరిగింది. అప్పటి నుంచి ఈ షేర్లు పైపైకి పరుగులు పెడుతూనే ఉన్నాయి.
మార్కెట్లో లిస్టయ్యి ఆరు నెలలు కూడా కాలేదు, ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చాయి. లిస్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ 185 శాతంపైగా పెరిగింది. ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఒక్కో షేర్‌కు రూ.524 చొప్పున IPOలో ఒక లాట్ దక్కించుకుని ఉంటే.. అతని పెట్టుబడి రూ.14,672 (28 x 524) అన్నమాట. ఇప్పుడు ఒక్కో షేర్ విలువ రూ.1,934కు చేరింది. ఈ లెక్కన అతని పెట్టుబడి విలువ రూ.54,152కు (28 x 1,934) పెరిగింది. ఒక్కో లాట్‌పై రూ.39,480 లాభం (54,152 – 14,672) వచ్చింది.
సచిన్ టెండూల్కర్ ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ షేర్ల ద్వారా భారీగానే సంపాదించాడు. గత 6 నెలల్లో సచిన్ పెట్టుబడి దాదాపు 15 రెట్లు పెరిగింది. సచిన్ 2023 మార్చి నెలలో ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌లో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. తద్వారా ఆయనకు ఈ కంపెనీలో 3,65,176 షేర్లు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీలో సచిన్ వాటా విలువ రూ.72.37 కోట్లకు చేరింది. అంటే ఇప్పటివరకు సచిన్ పెట్టుబడి 14.56 రెట్లు పెరిగింది.
IPO ధరతో (రూ.524) పోలిస్తే ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు ఈ ఆరు నెలల్లో 280 శాతం పెరిగాయి. లిస్టింగ్ తర్వాత 185 శాతానికి పైగా దూసుకెళ్లాయి. గత నెల రోజుల్లో 25 శాతం పైగా ర్యాలీ చేశాయి. ఈ స్టాక్ 52 వారాల కనిష్టం రూ.642.40 కాగా.. 52 వారాల గరిష్టం రూ.2,080. గురువారం (జూన్ 20న) ఆజాద్ ఇంజినీరింగ్ షేర్ 2.41 శాతం నష్టంతో రూ.1,934.10 దగ్గర సెటిల్ అయ్యింది.