Chandrababu Naidu : సత్యసాయి మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అనే బాబా స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. రాయలసీమ తాగునీటి ప్రాజెక్టు వంటి సత్యసాయి సేవా ట్రస్ట్ సేవలను కొనియాడారు.
అమరావతి: మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన శ్రీ సత్యసాయిబాబా స్ఫూర్తిని..మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని, భక్తుల్ని ఎంతో ప్రేమగా ‘బంగారూ’…అంటూ పిలిచే సత్యసాయి పిలుపు ఎప్పటికీ గుర్తుంటుందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం అని, లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది శ్రీసత్యసాయి మనకు చూపిన దారి అని తెలిపారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని.. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఇవాళ ఆయన శతజయంతి వేడుకలు జరుపుకుంటున్నాం అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు…ఆచరించారు. ఫలితం చూపించారు అని చంద్రబాబుకు సత్యసాయి బోధనలను కొనియాడారు. ప్రేమ ఒక్కటే మతం, హృదయం ఒక్కటే భాష, మానవత్వమే కులం, అన్నిచోట్లా దైవం ఉందని బోధించారని.. వేర్వేరు దేశాలు వేర్వేరు ప్రాంతాల ప్రజలను మనో దర్శనంతో ప్రభావితం చేశారని తెలిపారు.
రాష్ట్ర ప్రగతిలో సత్యసాయి సేవా ట్రస్టు సేవలు
విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ ఉచితంగా అందించేందుకు 102 సత్యసాయి విద్యాలయాలు…60,000 మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు.
సూపర్ స్పెషాలిటీ, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రుల ద్వారా రోజూ రోగులకు సేవలందుతున్నాయని, రాయల సీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రశాంతి నిలయాన్ని తాకట్టుపెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారని, ఈ విషయం తెలిసి భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకు పైగా జనాభాకు నీరిచ్చారని, చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు అని తద్వార రాష్ట్ర ప్రగతిని ముందుకుతీసుకెళ్లారని చంద్రబాబు ప్రశంసించారు.
బాబాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సచిన్ టెండుల్కర్
భారత రత్న, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మాట్లాడుతూ సత్యసాయితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
“నాకు ఐదేళ్ల వయసులో ఉండగా ఎక్కడికైనా వెళ్లినా ‘ఈ బాలుడు బాల సత్యసాయి బాబాలా ఉన్నాడు’ అని అందరూ చెప్పేవారని.. ఆ మాటలు అప్పట్లో వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, తరువాత బాబాతో ఏర్పడిన అనుబంధం ఆ మాటలకు అర్థం చూపిందని సచిన్ తెలిపాడు. 1990లలో వైట్‌ఫీల్డ్‌లో భగవాన్ సత్యసాయి బాబా దర్శనం పొందిన సందర్భాన్ని సచిన్ ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ “మనం అడగకపోయినా మన మనసులో ఏముందో, ఏ సందేహం వుందో బాబా ముందుగానే చెప్పేవారు. ఇది నమ్మశక్యం కాకపోయినా… నేను అనుభవించిన సత్యం.” శారీరక, మానసిక ఆరోగ్యంపై బాబా ఇచ్చిన బోధనలు తన జీవితాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు. 2011 వరల్డ్ కప్ సమయంలో అపారమైన అంచనాలు, ఒత్తిడి ఉండేవని.. బెంగళూరులో మా క్యాంప్ జరుగుతున్నప్పుడు బాబా ఫోన్ చేసి, ఒక పుస్తకం పంపించానని చెప్పారు. ఆ పుస్తకం నాలో అనూహ్యమైన విశ్వాసాన్ని రగల్చిందని సచిన్ గుర్తుచేసుకున్నారు. “2011లో ముంబైలో ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్‌లో భారత జట్టు గెలిచి ట్రోఫీ అందుకున్నప్పుడు… అది నా జీవితంలో గోల్డెన్ మూమెంట్. అనుభవం చెప్పింది — ఇది బాబా ఆశీస్సుల వల్లే సాధ్యమైంది.” ఆ విజయంతో బాబా తనకు అంతర్గత శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రసాదించారని తెలిపారు.“బాబా మన వెంట ఉంటే భయం అనే మాటనే ఉండదు. ఆయనను స్మరించడం ఒక ఆశీర్వాదం.” అన్నారు.
శ్రీ సత్యసాయి బోధనలు..సేవలు చిరస్మరణీయం : సినీ నటి ఐశ్వర్యారాయ్
ప్రజలకు సత్యసాయి చేసిన సేవలు, ఆయన బోధనలు ఎప్పటికి చిరస్మరణీయమని సినీ నటి ఐశ్వర్యా రాయ్ అన్నారు. సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచిపోయిందని..ఆయన మనతో లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గుండెల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ఆయన నేర్పిన పాఠాలు, మార్గదర్శకత్వం, ఆచరించిన విధానాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయని, నిజమైన నాయకత్వం అంటే భగవంతుడికి, ప్రజలకు సేవ చేయడం అని బాబా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. సత్యసాయి ఛారిటీ ద్వారా అమలవుతున్న విద్య, వైద్య సేవలతో ఎంతో మంది జీవితాలు మెరుగవుతున్నాయని తెలిపారు.
ప్రపంచ ఆధ్యాత్మిక శక్తి : పవన్ కల్యాణ్
సత్యసాయి ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన, ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టారని..తన ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచాన్ని ఆకర్షించారని గుర్త చేశారు. విదేశాల్లో చాలా మంది సత్యసాయి భక్తులను తాను చూశానన్నారు. సామాన్యుడికి తాగునీరు అందివ్వాలని సత్యసాయి ఆలోచించి.. జల్‌జీవన్ మిషన్ తరహాలో ఏర్పాట్లు చేయడం విశేషం అన్నారు. అలాంటి సేవా తత్పరత, ఆధ్యాత్మిక బోధనలతో సచిన్ తెందూల్కర్‌తో పాటు అనేక రంగాల ప్రముఖులను, ప్రజలను ప్రభావితం చేశారని..ప్రభుత్వం సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తుందని పవన్ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram