ఆదివారం మ్యాచ్ హైలైట్స్.. ధోని ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ వృథా అయ్యిందే..!

ఆదివారం మ్యాచ్ హైలైట్స్.. ధోని ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ వృథా అయ్యిందే..!

ఆదివారం రెండు స్ట‌న్నింగ్ మ్యాచెస్ జ‌రిగాయి. అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 162 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (29; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిల‌వ‌గా, జీటీ బౌల‌ర్‌ మోహిత్ శర్మ (3/25) మూడు వికెట్లతో స‌న్‌రైజ‌ర్స్‌ని దెబ్బ‌కొట్టాడు. ఇక ల‌క్ష్య చేధ‌నకు దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ (45; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ మిల్లర్ (44*; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విజ‌యానికి బాట‌లు వేశారు.

ఇక విశాఖ తీరాన చెన్నై, ఢిల్లీ మ‌ధ్య పోరు హోరా హోరీగా జ‌రిగింది. రిష‌బ్ నాయ‌క‌త్వంలోని ఢిల్లీ జ‌ట్టు ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌లు ఓడిపోగా, విశాఖ‌లో చెన్నైపై మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయ‌గా, ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52), కెప్టెన్ రిషభ్ పంత్ ( 51) అర్ధ సెంచరీలతో మెరిసారు. పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) కూడా మెరుపులు మెరిపించాడు. ఇక చెన్నై బౌలర్లలో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఇక భారీ ల‌క్ష్య చేధ‌న‌కు తిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్స్ ఇద్ద‌రు నిరాశ‌ప‌రిచారు. అజింక్యా రహానే(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కాస్త మెరుపులు మెరిపించ‌గా, డారిల్ మిచెల్(26 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) ప‌రుగులు చేశాడు. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన మహేంద్ర సింగ్ ధోనీ(16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్‌) ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే ఔటైన అనంతరం 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ‌రీగా త‌ర‌లించాడు. అయితే ఆ మ‌రుస‌టి బంతికి ఔటయ్యే ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన ధోని త‌న‌కు క‌లిచి వ‌చ్చిన విశాఖ మైదానంలో వింటేజ్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టాడు . ధోనీ క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి మ్యాచ్ ముగిసేవరకు విశాఖ మైదానంలోని అభిమానుల అరుపులు, కేక‌ల‌తో ర‌చ్చ చేశారు. ధోని ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడిన కూడా చెన్నై గెల‌వ‌క‌పోవ‌డం అభిమానుల‌ని కాస్త నిరాశ‌ప‌ర‌చింది.