Euro cup 2024 | యూరో కప్‌ విజేతగా నిలిచిన స్పెయిన్‌.. ఇంగ్లండ్‌కు మళ్లీ నిరాశే..!

Euro cup 2024 | యూరో కప్‌-2024 విజేతగా స్పెయిన్‌ నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో మట్టికరిపించింది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు చేరిన స్పెయిన్‌.. తుదిపోరులోనూ అదరగొట్టింది.

  • By: Thyagi |    sports |    Published on : Jul 15, 2024 6:47 AM IST
Euro cup 2024 | యూరో కప్‌ విజేతగా నిలిచిన స్పెయిన్‌.. ఇంగ్లండ్‌కు మళ్లీ నిరాశే..!

Euro cup 2024 : యూరో కప్‌-2024 విజేతగా స్పెయిన్‌ నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో మట్టికరిపించింది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు చేరిన స్పెయిన్‌.. తుదిపోరులోనూ అదరగొట్టింది. గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ ఈసారి కూడా రన్నరప్‌గానే మిగిలింది. ఇప్పటికే మూడు యూరో కప్‌లు గెలిచిన స్పెయిన్‌.. ఇప్పుడు మరో కప్‌ గెలుచుకుంది.

తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్‌ కోసం తీవ్రంగా పోరాడినప్పటికీ ఏ జట్టు కూడా గోల్‌ చేయలేకపోయింది. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన రెండు నిమిషాలకే అంటే 47 నిమిషాల వద్ద స్పెయిన్‌ ఆటగాడు నికో విలియమ్స్‌ అద్భుతమైన గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచాడు. 73 నిమిషాల వద్ద ఇంగ్లండ్‌ ఆటగాడు కోలె పాల్‌మెర్‌ గోల్‌ కొట్టడంతో రెండు జట్లు 1-1 స్కోర్‌తో సమమయ్యాయి.

చివరగా 86వ నిమిషంలో స్పెయిన్‌ ఆటగాడు మైకేల్‌ ఒయార్జాబల్‌ గోల్‌ కొట్టడంతో స్పెయిన్‌ మరోసారి ఆధిక్యంలోకి దూసుళ్లింది. అదనపు సమయంలో ఇంగ్లండ్‌ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోవడంతో స్పెయిన్‌ విజేతగా నిలిచింది.