IND vs SL| భారత్- శ్రీలంక తొలి వన్డే టై.. సూపర్ ఓవర్ ఎందుకు ఆడించలేదు..!
IND vs SL| భారత్ - శ్రీలంకల మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ నడుస్తుంది. తొలి వన్డే కొలంబో వేదికగా జరగగా, ఈ మ్యాచ్ మంచి మజా అందించింది.. మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక

IND vs SL| భారత్ – శ్రీలంకల మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ నడుస్తుంది. తొలి వన్డే కొలంబో వేదికగా జరగగా, ఈ మ్యాచ్ మంచి మజా అందించింది.. మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తా చాటి శ్రీలంకకి మంచి స్కోరు అందించారు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండు వికెట్లు తీశారు.
ఇక 231 పరుగుల లక్ష్య చేధనకి దిగిన భారత జట్టు 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (58; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, అక్షర్ పటేల్ (33; 57 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కేఎల్ రాహుల్ (31; 43 బంతుల్లో, 2 ఫోర్లు), విరాట్ కోహ్లి (24; 32 బంతుల్లో, 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (23; 23 బంతుల్లో, 4 ఫోర్లు) మోస్తరు పరుగులు చేశారు. వీరిలో ఒక్కరు స్టాండ్ అయి ఉన్నా భారత్ సునాయాసంగా గెలిచేది. కాని లంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) చెరో మూడు, వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటడంతో 230 పరుగులకే పరిమితం అయ్యారు.
అయితే టైగా మారిన భారత్-శ్రీలంక తొలి వన్డేకు సూపర్ ఓవర్ ఉంటుందని, అందులో ఆడి భారత్‌కి విజయం దక్కుతుందని అందరు అనుకున్నారు. ఇటీవల ముగిసిన మూడో టీ20 కూడా టై కావడంతో ఫలితం తేలడం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో భారత్ గెలిచింది. కానీ వన్డేకు సూపర్ ఓవర్ నిర్వహించలేదు. అలా నిర్వహించకపోవడానికి కారణం ఏంటనేది అందరికి పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఐసీసీ వన్డే రూల్స్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఓ మ్యాచ్‌లో విజేతను తేల్చడానికి సూపర్ ఓవర్ నిర్వహించరు. ఐసీసీ టోర్నమెంట్స్ వన్డే ఫార్మాట్‌లో జరిగితే మాత్రం సూపర్ ఓవర్లను నిర్వహిస్తారు. ఆ కారణంతో తొలి వన్డేకు సూపర్ ఓవర్ జరగలేదు.