శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం 15మంది సభ్యుల భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. భారత్ టెస్టు జట్టుకు కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ .. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ కొనసాగనున్నారు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి పునరాగమనం చేశాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ స్పిన్ విభాగంలో ఎంపికయ్యారు. కాగా యువ స్పిన్ ఆల్‌రౌండర్ సరాంశ్ జైన్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ సంచలనం సాయి సుదర్శన్‌లకు జట్టులో చోటు దక్కినా.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. గాయాల కారణంగా నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణాలను సెలక్టర్లు పక్కనపెట్టారు.
భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాంశ్ జైన్.
సరాంశ్ జైన్‌కు తొలి అవకాశం
ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో 33 ఏళ్ల సరాంశ్ జైన్‌కు అవకాశం కల్పించారు. ఇండోర్‌కు చెందిన సరాంశ్ జైన్ మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో విశేష అనుభవం కలిగి ఉన్న సరాంశ్ జైన్ ఇప్పటివరకు 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 31.75 సగటుతో 2000కు పైగా పరుగులు(ఒక సెంచరీ, ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశాడు. 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ జట్టుకు ఉపయోగపడే ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 47 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 553 రన్స్, 38 వికెట్స్.. 21 టీ20లో 37 రన్స్, 18 వికెట్స్ పడగొట్టాడు.
ఇండియా-ఏ తరఫున శ్రీలంక-ఏపై జరిగిన సిరీస్ లో నూ బాగా రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. లంకతో జరిగిన రెండు అనధికార టెస్టుల్లో తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండో టెస్టులో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆరు వికెట్లు పడగొట్టిన సరాంశ్.. బ్యాటింగ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. శ్రీలంకతో తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కితే.. 2021లో బ్రిస్బేన్‌లో వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేసిన తర్వాత భారత తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే ఆఫ్ స్పిన్నర్‌గా సరాంశ్ నిలుస్తాడు.
టెస్ట్ చాంపియన్ షిప్ లో భారత్ కు ఈ సిరీస్ కీలకం
శ్రీలంక పర్యటనకు ముందు ఆగస్టు 7 నుంచి కొలంబోలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరగనుంది. గత సీజన్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో వెనుకబడింది. ముఖ్యంగా గువాహటిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవడం భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద పరాజయంగా నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనలో విజయం సాధించి WTC పాయింట్ల పట్టికలో పుంజుకునేందుకు ఈ సిరీస్ భారత్ కు కీలకంగా మారనుంది.
