PCB | టీమిండియాను పాకిస్థాన్ పంపకపోతే.. భారత్, శ్రీలంక నిర్వహించే ప్రపంచకప్ ఆడబోం : పీసీబీ
PCB | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగనున్నది. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పాక్ ముమ్మరం చేసింది. మ్యాచులన్నీ పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని ఆ దేశం పట్టుదలగా ఉన్నది. హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించడంపై కొట్టిపారేస్తున్నది. ఈ నెల 19 నుంచి 22 వరకు కొలంబోలో ఐసీసీ వార్షిక సదస్సు జరుగనున్నది.

PCB | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగనున్నది. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పాక్ ముమ్మరం చేసింది. మ్యాచులన్నీ పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని ఆ దేశం పట్టుదలగా ఉన్నది. హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించడంపై కొట్టిపారేస్తున్నది. ఈ నెల 19 నుంచి 22 వరకు కొలంబోలో ఐసీసీ వార్షిక సదస్సు జరుగనున్నది. ఈ సదస్సులో హైబ్రీడ్ మోడల్‌పై ఏవైనా ప్రతిపాదనలు వస్తే వాటిని వ్యతిరేకించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పాక్ మీడియా జియో న్యూస్ కథనం వెలువరించింది. భారత్ – పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి.
అడపాదడపా ఐసీసీ టోర్నీ, ఆసియా కప్‌లోనే ఇరుదేశాలు పోటీపడుతున్నాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు రాకపోతే.. 2026లో శ్రీలంక – భారత్ సంయుక్తంగా నిర్వహించే వరల్డ్ కప్‌లో తాము పాల్గొనబోమని పాక్ క్రికెట్ బోర్డు హెచ్చరిస్తున్నది. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఈ టోర్నీ కోసం పాక్‌కు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ సుముఖంగా లేదన్న వార్తలపై పీసీబీ కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పాక్‌కు భారత జట్టును పంపిస్తామని ఇప్పటికే బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ముంబయి ఉగ్రదాడుల కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. 2008లో జరిగిన ఆసియా కప్ తర్వాత టీమిండియా దేశంలో మళ్లీ పర్యటించలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లో అసలే జరుగడం లేదు. ప్రపంచ కప్ తరహా ఐసీసీ టోర్నమెంట్లలో తటస్థ వేదికలపై జరిగే ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే ఇరు దేశాలు పోటీపడుతున్నాయి. వచ్చే ఏడాది పాక్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచులను తటస్థ వేదికలపై ఆడేలా హైబ్రీడ్ మోడల్‌ను అమలు చేయాలని ఐసీసీని కోరనున్నట్లు బీసీసీఐ సంకేతాలిచ్చిన విసయం తెలిసిందే.
గత ఆసియా కప్‌ను పాక్ నిర్వహించగా.. టీమిండియాను పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దాంతో చివరకు హైబ్రీడ్ మోడల్‌ను అనుసరించాల్సి వచ్చింది. దాంతో పాకిస్థాన్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించే అకాశం కోల్పోయింది. అందుకే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా స్వదేశంలోనే నిర్వహించాలని పీసీబీ పట్టుదలగా ఉన్నది. ఈ క్రమంలో పాక్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్‌కు టీమిండియా వెళ్తుందా? హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఆమోదం తెలుపుతుందా? లేదా వేచి చూడాల్సిందే. హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ అంగీకరించకపోయినా.. టీమిండియాను పాక్‌కు పంపేందుకు కేంద్రం అంగీకరించకపోయినా.. భారత్ స్థానంలో శ్రీలంకను బరిలోకి దింపేందుకు పాక్ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకోనున్నారో మరో వారం రోజుల్లో తేలనున్నది.