అరంగేట్రంలోనే అదరగొట్టిన హైదరాబాద్ పేసర్… ఎవరీ ప్రఫుల్ హింగే.?

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ యువ పేసర్ ప్రఫుల్ హింగే మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ పతనాన్ని శాసించాడు. మొదటి ఓవర్లోనే 3 వికెట్లు రాలడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రఫుల్ నేపథ్యం, గణాంకాలు, భవిష్యత్ అవకాశాలపై విశ్లేషణ.

Praful Hinge bowling action during record-breaking debut over for SRH in IPL

ఐపీఎల్ చరిత్ర సృష్టించిన తొలి ఓవర్‌లో బౌలింగ్. అత్యంత అరుదైన సందర్భం.

Unknown to Unstoppable: Praful Hinge’s Dream IPL Debut Shocks Rajasthan Royals

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి తొలి ఓవర్‌లో 3 వికెట్లు

అరంగేట్రంలోనే రికార్డు సృష్టించిన ప్రఫుల్ హింగే

 

విధాత క్రీడా విభాగం |హైదరాబాద్:
IPL 2026: ఐపీఎల్ అనేది కేవలం స్టార్ ప్లేయర్ల వేదిక మాత్రమే కాదు… ఇక్కడ ప్రతి సీజన్లో ఒక కొత్త కథ పుడుతుంది. ఆ కథల్లో కొన్నిటి ఆరంభమే సంచలనంగా ఉంటుంది. అలాంటి అరుదైన ఆరంభంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు – ప్రఫుల్ హింగే.

ఒత్తిడినే అవకాశంగా మార్చుకున్న ప్రఫుల్​

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాజస్థాన్ రాయల్స్తో తొలి మ్యాచ్ ఆడిన ఈ యువ పేసర్, ఇన్నింగ్స్ తొలి ఓవర్, తన మొదటి ఓవర్‌తోనే ఒక్కసారిగా మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ప్రేక్షకులు ఇంకా సరిగా కూర్చోకముందే… స్కోర్‌బోర్డ్‌పై వికెట్ల పతనం మొదలైంది. అరంగేట్రం అంటే సాధారణంగా ఒత్తిడి, టెన్షన్, భయం ఉండాల్సిన సందర్భం. కానీ హింగే మాత్రం ఆ ఒత్తిడిని అవకాశంగా మార్చుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఎదుట బంతి చేతిలోకి తీసుకున్న హింగే, రెండో బంతికే తొలి వికెట్గా సెన్సేషనల్ సూర్యవంశీని ఔట్ చేసి తన వేట మొదలుపెట్టాడు. వెంటనే మూడో బంతికి మరో వికెట్… ధనాధన్ ధృవ్ జురెల్. అదే ఓవర్ చివరి బంతికి ఇంకో వికెట్… ఈసారి ప్రిటోరియస్. ఇలా.. మొట్టమొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా రాజస్థాన్ బ్యాటింగ్ను తుత్తునియలు చేసి చరిత్ర సృష్టించాడు.

ఇక్కడితో ఆగలేదు. తన రెండో ఓవర్‌లోనే రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ తీసి… ఇది యాదృచ్ఛికం కాదు, తన సామర్థ్యానికి నిదర్శనం అని నిరూపించాడు. ఐపీఎల్ చరిత్రలో చాలా మంది ఆటగాళ్లు వచ్చారు, వెళ్లారు. కానీ తొలి మ్యాచ్‌లోనే ఇలా ప్రభావం చూపిన వాళ్లు చాలా అరుదు. ఈ ప్రదర్శన భారత క్రికెట్ చరిత్రలో తన పేరిట ఒక ప్రత్యేక పేజీని లిఖించుకుంది.

ఒక్క ఓవర్… మ్యాచ్ ఫలితాన్నే నిర్ణయించింది

అందరినీ షాక్​కు గురిచేసిన మొదటి ఓవర్​. ప్రఫుల్ హింగే సంచలనం

మ్యాచ్‌లో కొన్ని క్షణాలు ఉంటాయి — అవే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఈ మ్యాచ్‌లో అలాంటి క్షణం హింగే వేసిన మొదటి ఓవర్. అది రాజస్థాన్ ఇన్నింగ్స్కు మొదటి ఓవర్. లక్ష్యం చాలా పెద్దది. అటుపక్క యశస్వి జైస్వాల్. తొలి బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఇప్పుడు బ్యాట్తో ఎదురుగా ఉన్నది మహామహులైన బౌలర్లనే ఉతికారేసిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. ఆదినుండే ఎదురుదాడికి దిగి బౌలర్ల విశ్వాసాన్ని దెబ్బతీసే హిట్టర్. కానీ ఊహించని విధంగా వచ్చిన బంతిని స్వీప్ చేద్దామనుకున్నాడు వైభవ్. అంతే.. తన తల మీదే గాల్లోకి లేచిన బాల్ను కీపర్ ఆరోరా అలవోకగా అందుకున్నాడు. సూర్యవంశీ సున్నాకే వెనుదిరిగాడు. 4వ బంతికి జురెల్ మలి. ఆఖరి బంతికి ప్రిటోరియస్.. అంతే.. ఒకే ఒక్క పరుగుకు ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్లో. స్టేడియం మొత్తం స్టన్నయింది.. రాజస్థాన్ క్యాంప్తో సహా. ఒక్కసారిగా వరుసగా వికెట్లు పడిపోవడంతో వారి ప్లాన్ పూర్తిగా దెబ్బతింది.

ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఔట్ కావడం వల్ల మధ్యవరుసపై ఒత్తిడి పెరిగింది. ఐపీఎల్ లాంటి వేగవంతమైన టోర్నీలో ఇలాంటి షాకులు జట్టును మళ్లీ నిలబడనివ్వవు. హింగే వేసిన ఆ ఓవర్ సన్‌రైజర్స్‌కు కేవలం వికెట్లు మాత్రమే ఇవ్వలేదు… మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని సాదించిపెట్టింది.

బౌలింగ్‌లో అతని లైన్-లెంగ్త్ క్రమశిక్షణ, బ్యాటర్లను అర్థం చేసుకుని బంతి వేయడం, ఒత్తిడిలోనూ స్థిరంగా ఉండడం — ఇవన్నీ అతను సాధారణ బౌలర్ కాదని సూచిస్తున్నాయి. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇలాంటి పరిణితి ప్రదర్శించడం మామూలు విషయం కాదు.

ఎవరీ ప్రఫుల్ హింగే?

తొలి ఓవర్‌లో వికెట్ తీసి ఉత్సాహంగా సంబరాలు జరుపుతున్న హింగే

ప్రఫుల్ హింగే విదర్భకు చెందిన యువ ఫాస్ట్ బౌలర్. అతని ప్రయాణంలో పెద్దగా సంచలనాలు లేకుండా, నెమ్మదిగా ముందుకు సాగింది. ప్రధానంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీసి, సగటు 26.7తో నిలకడగా మంచి ప్రదర్శన ఇచ్చాడు.

అతను ప్రధానంగా రెడ్‌బాల్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందినా… టి20లో అవకాశాలు చాలా తక్కువే వచ్చాయి. లిస్ట్-Aలో కూడా ఎక్కువగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా… సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని సామర్థ్యాన్ని గుర్తించి రూ.30 లక్షలకు జట్టులోకి తీసుకుంది.

మొదట అతను కేవలం బ్యాకప్ ఆప్షన్‌గా భావించబడినా… ఈ ఒక్క మ్యాచ్‌తోనే తన స్థానాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు అతను కేవలం స్క్వాడ్ ప్లేయర్ కాదు — జట్టుకు అవసరమైన మ్యాచ్ విన్నర్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్‌లో ప్రతిభకు కొదవలేదు. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకుంటాడనేదే ఆటగాడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రఫుల్ హింగే ఆ అవకాశాన్ని కేవలం వినియోగించుకోలేదు… ఘనంగా ప్రకటించాడు.

ఇలాంటి ప్రదర్శనే కొనసాగితే, హింగే కేవలం సన్‌రైజర్స్‌కే కాదు… భారత క్రికెట్‌కు కూడా మరో విశ్వసనీయ ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లో అతని ప్రదర్శనపై అందరి దృష్టి ఉండటం ఖాయం.

Latest News