ప్లేఆఫ్స్‌ 4వ బెర్తు ఖరారు.. హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌లో ఢీకి రాజస్థాన్ సిద్ధం

ముంబయిపై గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆఖరి బెర్త్‌ను దక్కించుకుంది. ఈ ఫలితంతో కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఆశలు ముగిశాయి. ఇక ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌తో RR ఢీ సిద్ధమైంది.

  • By: ADHARVA |    sports |    Published on : May 24, 2026 8:16 PM IST
ప్లేఆఫ్స్‌ 4వ బెర్తు ఖరారు.. హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌లో ఢీకి రాజస్థాన్ సిద్ధం ప్లేఆఫ్స్‌ ఆఖరి స్థానాన్ని ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌తో ఢీకి సిద్ధం.

RR Seal Final Playoff Spot, Set Up Eliminator Clash With SRH

  • ముంబయిపై విజయంతో ప్లేఆఫ్స్​కు రాజస్థాన్​
  • కోల్‌కతా, పంజాబ్ ఆశలు గల్లంతు
  • ఈనెల 27న సన్​రైజర్స్​ – ఆర్​ఆర్​ ఎలిమినేటర్​

విధాత క్రీడా విభాగం | మే 24, 2026:

ముంబయి: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ఆఖరి బెర్త్‌పై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ముంబయి ఇండియన్స్‌పై కీలక విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ ఫలితంతో కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ ఢీ ఖాయమైంది.

ఆఖరి బెర్త్‌ను దక్కించుకున్న రాజస్థాన్

ఐపీఎల్‌ లీగ్ దశ చివర్లో ప్లేఆఫ్స్‌ రేసు మరింత ఉత్కంఠగా మారినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ ఆ లెక్కలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టింది. ముంబయి ఇండియన్స్‌తో నేడు ముంబయిలో జరిగిన కీలక పోరులో గెలిచి ప్లేఆఫ్స్‌ ఆఖరి స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్‌కు దాదాపు నాకౌట్ పోరులాంటిదే. గెలిస్తే ప్లేఆఫ్స్‌, ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే ఒత్తిడిని తట్టుకుని ఆర్​ఆర్​ తమ స్థానాన్ని తామే ఖాయం చేసుకుంది.

రాజస్థాన్ గెలుపుతో కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఆశలు చెదిరిపోయాయి.  ఇప్పడు నడుస్తున్న కోల్​కతా–ఢిల్లీ మ్యాచ్​ వృథాగా మారిపోయింది. చివరి బెర్త్ కోసం ఈ మూడు జట్ల మధ్యే ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో, రాజస్థాన్‌ విజయం మిగతా లెక్కలను పూర్తిగా మార్చేసింది. దీంతో ఇప్పడు నడుస్తున్న కోల్​కతా–ఢిల్లీ మ్యాచ్ ఫలితం లేదా తదుపరి సమీకరణాలకు ఉన్న ప్రాధాన్యం ఒక్కసారిగా తగ్గిపోయింది.

హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌కు రంగం సిద్ధం

ముంబయిపై విజయం తర్వాత సంబరాలు చేసుకుంటున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు

ముంబయి ఇండియన్స్‌పై కీలక గెలుపుతో ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.

రాజస్థాన్ ప్లేఆఫ్స్‌లోకి రావడంతో ఇప్పుడు నాకౌట్ చిత్రం స్పష్టమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ఎలిమినేటర్‌లో తన ప్రత్యర్థి కోసం ఎదురుచూస్తుండగా, ఆ స్థానానికి ఇప్పుడు రాజస్థాన్ చేరింది. దీంతో ఈ నెల 27న జరుగనున్న హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ ఎలిమినేటర్​ పోరు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. హైదరాబాద్​ దూకుడు బ్యాటింగ్, రాజస్థాన్ సమతుల్య జట్టు నిర్మాణం ఈ ఎలిమినేటర్‌ను హైవోల్టేజ్ మ్యాచ్‌గా మార్చే అవకాశముంది. లీగ్ దశలో చేసిన తప్పులకు ఇక్కడ అవకాశం ఉండదు. ఈ మ్యాచ్​లో ఓడిపోయినవారు ఇంటిముఖం పట్టాల్సిఉండటంతో ఇరు జట్లకు ఇది అగ్నిపరీక్షగా మారింది.

రాజస్థాన్‌కు ముంబయిపై విజయం కేవలం ప్లేఆఫ్స్ టికెట్ మాత్రమే కాదు.. నాకౌట్ దశకు ముందు వచ్చిన పెద్ద మానసిక బలం కూడా. ఒత్తిడి మ్యాచ్‌లో నిలబడగలమని రాజస్థాన్ నిరూపించింది. ఇక హైదరాబాద్‌తో జరిగే ఎలిమినేటర్‌లో అదే ఆత్మవిశ్వాసం కొనసాగుతుందా అనేది చూడాలి.

 ముంబయిపై రాజస్థాన్ విజయం ప్లేఆఫ్స్ రేసులో ఆఖరి నిర్ణయంగా మారింది. రాజస్థాన్ బెర్త్ ఖరారు కావడంతో కోల్‌కతా, పంజాబ్ ఆశలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్–రాజస్థాన్ ఎలిమినేటర్‌పైనే నిలిచింది.