Rohith Sharma : ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో రోహిత్ శర్మ టాప్!
తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (781 పాయింట్లు) అగ్రస్థానం దక్కించుకున్నాడు. వన్డేల్లో నెం.1 ర్యాంకు సాధించిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. గత టాపర్ శుభ్‌మన్ గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్ ఒక్కడే టాప్-10లో నిలిచాడు.
విధాత : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో అగ్ర స్థానం సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకిన రోహిత్ శర్మ 781పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న అతి పెద్ద వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ కెరీర్లో వన్డేల్లో అగ్రస్థానం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
టెస్టులకు, టీ 20లకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ ఏడు నెలల విరామం తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ వన్డే మ్యాచ్ తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. అసీస్ తో మూడు వన్డేల సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన అతడిని ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో టాప్ ర్యాంకర్‌గా నిలిపింది. ఇప్పటివరకు టాపర్ గా ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (764) రెండో స్థానంలో ఉండగా.. శుభ్‌మన్ గిల్ (745 పాయింట్లు), బాబర్ అజామ్ (739), విరాట్ కోహ్లీ (725) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రేయస్ అయ్యర్ (700) టాప్ -10లో కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (589) ఏకంగా 23 స్థానాలను మెరుగుపర్చుకొని 25వ ర్యాంక్‌ను అందుకోవడం విశేషం.
బౌలింగ్ విభాగంలో ఐసీసీ టాప్ టెన్ లో ఒకే ఒక్కడు
బౌలింగ్ విభాగంలో టీమ్‌ఇండియా నుంచి కుల్‌దీప్ యాదవ్ (634 పాయింట్లు) ఒక్కడే ఐసీసీ టాప్ టెన్ ర్యాంకుల్లో ఉన్నాడు. అతను కూడా ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకులో నిలిచాడు. అఫ్గాన్ ఆటగాడు రషీద్ ఖాన్ (710) బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (628) రెండు స్థానాలు పైకి ఎగబాకి 8వ ర్యాంకులో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అఫ్గాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్‌దే (334) టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. టీమిండియా నుంచి రవీంద్ర జడేజా (215) ఒక్కడే టాప్ టెన్ లో ఉన్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram