SA in WWC 2025 Finals | చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు : తొలిసారి ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశం
వోల్వార్ట్ (169) అద్భుత ఇన్నింగ్స్, క్యాప్ (5/20) బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌పై 125 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది.
Wolvaardt’s 169, Kapp’s five-for script history as South Africa reach first-ever Women’s World Cup final
(విధాత స్పోర్ట్స్ డెస్క్)
గౌహతి:
మహిళల వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌పై 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ బ్యాటర్ లారా వోల్వార్ట్ (169), ఆల్‌రౌండర్ మారిజాన్ క్యాప్ (5 వికెట్లు) ప్రధాన పాత్ర పోషించారు.
ముందుండి నడిపించిన కెప్టెన్ వోల్వార్ట్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, ఓపెనర్, కెప్టెన్ లారా వోల్వార్ట్ క్లాస్ ఆటతో ఆకట్టుకుంది. ఆమె ఇన్నింగ్స్ ఆరంభంలో డ్రైవ్స్‌తో, మధ్యలో కవర్ షాట్లతో, చివర్లో పవర్ హిట్స్‌తో ప్రణాళికాబద్ధంగా ఆడింది. శతకం సాధించిన తర్వాత వోల్వార్ట్ విజృంభించి షాట్లతో చెలరేగింది. టాజ్మిన్ బ్రిట్స్ (45) స్థిరంగా ఆడుతూ భాగస్వామ్యాన్ని కొనసాగించగా, మధ్యలో గాయపడి మైదానం విడిచింది. తరువాత క్యాప్ (42 పరుగులు, 33 బంతులు) వేగంగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగెత్తించింది. చివర్లో క్లోయ్ ట్రయాన్ (33 నాటౌట్) తో కలిసి వోల్వార్ట్ 89 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి, నిర్ణీత 50 ఓవర్లలో 319/7 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. ఇది మహిళల వరల్డ్‌కప్ నాకౌట్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు.

పేకమేడలా కూలిన ఇంగ్లండ్
320 పరుగుల భారీ లక్ష్యచేధనకు బరిలో దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడి, ఒక్క పరుగుకే మూడు వికెట్లు కోల్పోయింది. తరువాత నాట్ సివర్ బ్రంట్ (64) మరియు అలిస్ క్యాప్సీ (50) భాగస్వామ్యం ద్వారా ఇంగ్లండ్ కొంత స్థిమితపడింది. వీరిద్దరూ కలిసి శతక భాగస్వామ్యాన్ని నిర్మించినప్పటికీ, క్యాప్ తిరిగి వచ్చి సివర్ బ్రంట్‌ను ఔట్ చేయగా, ఆ తర్వాత వరుస బంతుల్లో సోఫియా డంక్లీ, చార్లీ డీన్‌లను ఔట్ చేస్తూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా తుత్తునియలు చేసింది. చివరికి 42.3 ఓవర్లలో 194 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. క్యాప్ మొత్తం 8.4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించింది — ఇది ఆమె వరల్డ్‌కప్ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్.
ఇంగ్లండ్ బౌలింగ్‌లో సోఫీ ఎకిల్‌స్టోన్ (4/44) మెరుపులు మెరిపించినా, మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చారు. బ్యాటింగ్ విభాగంలో సివర్ బ్రంట్, క్యాప్సీ, ఇంకో ఇద్దరు తప్ప ఇంకెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా దాటలేకపోయారు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తమ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. గత రెండు టి20 వరల్డ్‌కప్‌లలో (2023, 2024) రన్నరప్‌గా నిలిచిన తర్వాత ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఫైనల్ చేరడం వారికి ప్రత్యేకమైన ఘనత. వచ్చే ఆదివారం ఫైనల్‌లో వారు భారత్–ఆస్ట్రేలియా సెమీఫైనల్ విజేతతో తలపడనున్నారు. వోల్వార్ట్ అద్భుత ఇన్నింగ్స్ మరియు క్యాప్ ఘన బౌలింగ్ ప్రదర్శన దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ విజయంగా నిలిచాయి.
కాగా, రేపు భారత్ – ఆస్ట్రేలియాల మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. నవీముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. స్టార్ స్పోర్ట్స్ చానెల్, డిడి స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్షప్రసారం ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram