చేపాక్‌లో చెలరేగిన సన్‌రైజర్స్‌.. చెన్నైపై విజయంతో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశం

చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఇషాన్ కిషన్‌, క్లాసెన్‌ కీలక ఇన్నింగ్స్‌లతో ఎస్‌ఆర్‌హెచ్‌ లక్ష్యాన్ని ఛేదించింది.

  • By: ADHARVA |    sports |    Published on : May 19, 2026 12:09 AM IST
చేపాక్‌లో చెలరేగిన సన్‌రైజర్స్‌.. చెన్నైపై విజయంతో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశం చెన్నైపై ఛేదనలో కీలక భాగస్వామ్యం నమోదు చేసిన హెన్రిచ్ క్లాసెన్‌, ఇషాన్ కిషన్‌

SRH Beat CSK By 5 Wickets, Qualify For IPL 2026 Playoffs

  • కిషన్​ – క్లాసెన్​ వీరోచిత పోరాటంతో ప్లేఆఫ్స్​కు హైదరాబాద్​
  • సొంత మైదానంలో చెన్నైకి భారీ షాక్‌ – దాదాపు ఇంటికే

విధాత స్పోర్ట్స్ డెస్క్ | మే 18, 2026​:

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్​లోకి అధికారికంగా ప్రవేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. కీలక మ్యాచ్​లో ఓటమిపాలైన సీఎస్‌కే దాదాపు ఇంటిముఖం పట్టినట్లే.

టాస్​ గెలిచినా, భారీ స్కోరు చేయలేకపోయిన సూపర్​ కింగ్స్​

టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో మధ్య ఓవర్లలో బ్యాటర్లు వేగం పెంచడంతో జట్టు పోటీ స్కోరు నమోదు చేసింది. అయితే చివరి ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై 200 మార్క్‌ను అందుకోలేకపోయింది.

ఇషాన్​(దార్) –​ క్లాసెన్​ క్లాసిక్​ ఇన్నింగ్స్​

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అభిషేక్​ దూకుడుగా ఇన్నింగ్స్​ ఆరంభించినా, పరుగులు వేగంగా రాబట్టలేకపోయారు. మళ్లీ ఇషాన్ కిషన్ – క్లాసెన్​ జంట​ద్భుతమైన పోరాట పటిమ కనబర్చి మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ వైపు తిప్పారు. మధ్యలో సీఎస్‌కే బౌలర్లు వికెట్లు తీసి ఒత్తిడి తెచ్చినా, హెన్రిచ్ క్లాసెన్ అనుభవంతో ఇన్నింగ్స్‌ను చక్కగా ముందుకు నడిపించాడు. చివర్లో సలిల్ అరోరా మెరుపు షాట్లతో మ్యాచ్‌ను ముగించాడు.

19వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టు ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ సీజన్‌లో సమతూకమైన బ్యాటింగ్‌, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ అత్యంత ప్రమాదకర జట్లలో ఒకటిగా నిలుస్తోంది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది. చెపాక్‌లో సొంత అభిమానుల ముందే కీలక మ్యాచ్ కోల్పోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ధోనీ అభిమానులు కూడా ఈ ఫలితంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక చెన్నై గుజరాత్​తో మిగిలిన మ్యాచ్​ను తప్పకుండా భారీ తేడాతో గెలిచి, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సిఉంది.

స్కోర్ కార్డు:

చెన్నై సూపర్ కింగ్స్ – 180/7 (20 ఓవర్లు)

సన్‌రైజర్స్ హైదరాబాద్ – 181/5 (19 ఓవర్లు)

ఫలితం: సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం