హైదరాబాద్ టాప్-2లో ఉండాలంటే.. బెంగళూరుపై ఎలా గెలవాలి? సమీకరణాలు ఇలా..!
ఐపీల్ 2026 ప్లేఆఫ్స్‌లో 1, 2 స్థానాల్లో ఉండటం వల్ల అదనంగా వచ్చే మరో అవకాశం కోసం 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఏం చేయాలి? చెన్నైపై గుజరాత్ భారీ విజయం హైదరాబాద్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది? రేపటి SRH vs RCB మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-2లోకి రావాలంటే సాధ్యమేనా?
బెంగళూరుపై సన్‌రైజర్స్ ఎలా గెలుస్తుందన్నదే టాప్-2 లెక్కలో కీలకం కానుంది.
SRH Top 2 Chances: How Hyderabad Can Overtake GT In IPL 2026 Playoffs Race
SRH టాప్-2 లెక్క ఇదే..
- ● గుజరాత్ NRR దాటడమే SRH అసలు టార్గెట్
- ● 100+ పరుగుల భారీ విజయం తప్పనిసరి
- ● ఛేజింగ్‌లో 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి
- ● గుజరాత్‌ను దాటితే నంబర్ వన్ ఛాన్స్ కూడా..
విధాత స్పోర్ట్స్ డెస్క్ | మే 22, 2026:
హైదరాబాద్: ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి అంకానికి చేరుకున్న వేళ ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల భారీ విజయంతో 18 పాయింట్లకు చేరింది. ఈ ఫలితంతో గుజరాత్ నెట్ రన్‌రేట్ +0.695కు పెరిగి టాప్-2 రేసులో బలమైన స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్ భారీ విజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రేపటి సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై పడింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక మారింది.
ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లు, +1.065 నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లు, +0.695 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లు, +0.350 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. మరి హైదరాబాద్ 1వ లేదా 2వ స్థానానికి చేరుతుందా? నేటి గుజరాత్ భారీ విజయం సన్‌రైజర్స్‌పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది.? ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు గుజరాత్ ఘన విజయం హైదరాబాద్ ఫైనల్ దారికి ఎలా అడ్డుపడింది.?
ఫైనల్ వెళ్లే దారి ఇలా..

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో టాప్-2 స్థానాల కోసం జట్ల మధ్య నెట్ రన్‌రేట్ లెక్కలు ఆసక్తికరంగా మారాయి.
ఫైనల్‌కు వెళ్లే దారిలో ముందుగా క్వాలిఫయర్ 1లో మొదటి 2 స్థానాల్లో ఉన్న జట్టు పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు, 3,4 స్థానాల జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్ 2లో తలపడుతుంది. ఇందులో విజయం సాధించిన జట్టు అప్పుడు ఫైనల్లో క్వాలిఫయర్1 విజేతతో ఢీకొంటుంది. కాబట్టి, 1వ లేదా 2వ స్థానంలో ఉంటే ఓడిపోయినా ఇంకో మ్యాచ్(ఎలిమినేటర్) ఉంటుంది. అందులో గెలిచి మళ్లీ ఫైనల్ కోసం పోరాటం కొనసాగించవచ్చు. 3, 4 స్థానాల మధ్య జరిగే ఎలిమినేటర్ అంటే నాకౌట్ మ్యాచ్. ఓడితే ఇంటికే. అందుకే అన్ని జట్లు 1 లేదా 2వ స్థానంలో ఉండాలని కోరుకుంటాయి. మరి ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటి?
మామూలు గెలుపు కాదు.. అత్యంత భారీ విజయం

SRH vs RCB మ్యాచ్ ఫలితం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాలను నిర్ణయించే అవకాశం ఉంది.
రేపు RCBపై SRH గెలిస్తే సన్‌రైజర్స్ కూడా 18 పాయింట్లకు చేరుతుంది. అప్పుడు RCB, GT, SRH మూడు జట్లు 18 పాయింట్లతో సమంగా ఉంటాయి. కానీ ఇక్కడ ప్లేఆఫ్స్ స్థానాన్ని నిర్ణయించేది కేవలం పాయింట్లు కాదు.. నెట్ రన్‌రేట్. అదే SRHకు అసలు సవాలు.
అధికారిక గణాంకాల ప్రకారం హైదరాబాద్ ఇప్పటివరకు 256.1 ఓవర్లలో 2599 పరుగులు చేసింది. ప్రత్యర్థులకు 252.4 ఓవర్లలో 2475 పరుగులు ఇచ్చింది. దీంతో సన్‌రైజర్స్ ప్రస్తుత నెట్ రన్‌రేట్ +0.350గా ఉంది. మరోవైపు బెంగళూరు 234.2 ఓవర్లలో 2442 పరుగులు చేసి, 252.4 ఓవర్లలో 2364 పరుగులు ఇచ్చింది. దీనివల్ల ఆర్సీబీ నెట్ రన్‌రేట్ +1.065గా ఉంది.
ఇప్పుడు SRH టాప్-2లోకి రావాలంటే ప్రస్తుతం GTకి ఉన్న నెట్ రన్‌రేట్ +0.695ను దాటాలి. అంటే RCBపై సాధారణ 20-30 పరుగుల గెలుపు సరిపోదు. 50-60 పరుగుల తేడాతో గెలిచినా హైదరాబాద్ NRR సుమారు +0.50 నుంచి +0.55 మధ్యలోనే ఉంటుంది. అప్పుడు 18 పాయింట్లు వచ్చినా SRH మూడో స్థానంలోనే కొనసాగుతుంది.
హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేస్తే?
ఒకవేళ SRH ముందుగా బ్యాటింగ్ చేస్తే లెక్క చాలా కఠినంగా ఉంది. ఉదాహరణకు సన్‌రైజర్స్ 200 పరుగులు చేస్తే RCBని 99 పరుగులకే పరిమితం చేయాలి. అంటే కనీసం 101 పరుగుల తేడాతో గెలిస్తేనే SRH నెట్ రన్‌రేట్ గుజరాత్ నెట్ రన్‌రేట్ +0.695ను స్వల్పంగా దాటుతుంది. 102 పరుగుల తేడా సురక్షితంగా ఉంటుంది. 105 పరుగుల భారీ విజయం సాధిస్తే మాత్రం SRH గుజరాత్‌ను దాటడమే కాకుండా, ఘోర పరాజయం వల్ల బెంగళూరు NRR కూడా భారీగా పడిపోవడంతో నేరుగా అగ్రస్థానానికి వెళ్లే అవకాశముంది.
స్కోరు ఎలా ఉన్నా లెక్క దాదాపు ఇదే. SRH 160 చేసినా, 180 చేసినా, 200 చేసినా కనీసం 101 పరుగుల తేడాతో గెలవాలి. 220 లేదా అంతకుమించి చేస్తే దాదాపు 102 పరుగుల తేడా అవసరం. అందుకే రేపటి మ్యాచ్‌లో SRHకు టాప్-2 లక్ష్యం అంటే సాధారణ విజయం కాదు.. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపించే భారీ గెలుపే కావాలి.
ఛేజింగ్‌లో అయితే 10 ఓవర్లలోనే ముగించాలి
SRH రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తే పరిస్థితి మరింత కఠినంగా ఉంటుంది. బెంగళూరు ముందుగా 180-200 మధ్యలో స్కోరు చేసిందనుకుంటే, SRH ఆ లక్ష్యాన్ని దాదాపు 10 ఓవర్లలోనే అందుకోవాలి. అంటే సుమారు 59-60 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాలి. ఇది ఐపీఎల్ స్థాయిలో అత్యంత దూకుడైన, వేగవంతమైన ఛేజింగ్ అవుతుంది.
ఉదాహరణకు RCB 180 చేస్తే SRH 181 లక్ష్యాన్ని 10.1 ఓవర్లలోపు ఛేజ్ చేయాలి. RCB 200 చేస్తే 201 లక్ష్యాన్ని సుమారు 10.2 ఓవర్లలోపు చేరుకోవాలి. అప్పుడు మాత్రమే హైదరాబాద్ NRR +0.695 దాటి GTపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటే RCB నెట్ రన్‌రేట్ కూడా దారుణంగా పడిపోతుంది. అందువల్ల SRH కేవలం టాప్-2కే కాదు.. ఏకంగా మొదటి స్థానానికే వెళ్లే అవకాశం ఉంటుంది.
ఒక అద్భుతమే జరగాలి..!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టాప్-2లో నిలవాలంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై భారీ విజయం అవసరం.
మొత్తంగా చూస్తే రేపటి SRH-RCB మ్యాచ్ సాధారణ లీగ్ మ్యాచ్ కాదు. ఇది ప్లేఆఫ్స్‌లో ఎవరు టాప్-2లో నిలవాలి? క్వాలిఫయర్-1లో ఎవరు ఆడాలి? ఎలిమినేటర్‌లో ఒకరు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలిసే పోరు. SRH గెలిస్తే మూడు జట్లు 18 పాయింట్లతో సమమవుతాయి. కానీ GTను దాటాలంటే SRHకు 100 పరుగులకు పైగా తేడాతో భారీ విజయం లేదా 10 ఓవర్లలో గమ్యాన్ని చేరుకునే ఛేజ్ తప్ప మరో మార్గం కనిపించడం లేదు.
అందుకే రేపటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్ష్యం ఒక్కటే — RCBపై గెలవడం మాత్రమే కాదు.. టేబుల్‌ను కుదిపేంత పెద్ద గెలుపు సాధించడం. అది అంత సులువైతే కాదు. దాదాపు అసంభవం కూడా.
SRHకు ప్లేఆఫ్స్ బెర్త్ ఇప్పటికే ఖరారైనా, టాప్-2కు వెళ్లే దారి మాత్రం కఠినంగా మారింది. చెన్నైపై గుజరాత్ భారీ విజయం హైదరాబాద్ పాలిట శాపంగా మారింది. గుజరాత్ NRR +0.695ను దాటాలంటే రేపు సన్‌రైజర్స్ అద్భుతమే చేయాలి. లేకపోతే 18 పాయింట్లు వచ్చినా మూడో స్థానంతో నాకౌట్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram